April 19, 2013

ఈ చీకటిని చీల్చితేనే వెలుగు!

దూరంగా వెలుగులు, ఈ దగ్గరంతా చీకట్లు. రూపాయికి బొమ్మాబొరుసు. అభివృద్ధి పథంలో తెలుపు, నలుపు. పారిశ్రామిక ప్రగతికి నేను వ్యతిరేకం కాదు. కానీ, అంధకారం తప్ప ఆశని నింపని ఆ పరిశ్రమని ఎలా సమర్థించడం? పరిశ్రమ వస్తున్నదంటే..పది చేతులకు పని దొరకాలి. పది గ్రామాలకు కొత్త ఉపాధి దారులు పడాలి. పది ప్రాంతాలు బాగుపడాలి. అప్పటిదాకా సంప్రదాయ విధానంలో సాగుతున్న ఉత్పత్తి కార్యకలాపాలు చైతన్యం పుంజుకోవాలి.

కానీ, మాకవరపాలెం ప్రాంతంలో 'అన్‌రాక్' వచ్చి చేసిందేమిటి? ఈ బాక్సైట్ కంపెనీ పేరు వింటేనే స్థానికులు కన్నెర్ర చేయడం గమనించాను. వెనకబడిన ప్రాంతంలో ఇంత భారీ పరిశ్రమ వచ్చిందంటే..ఎవరైనా ఆహ్వానించాల్సిందే. పారిశ్రామిక మనుగడ రీత్యానే కాదు, ప్రాంతీయాభివృద్ధి దృష్ట్యా కూడా పరిశ్రమలు రావాల్సిందే. కానీ, 'అన్‌రాక్' తమ బతుకుకు గుదిబండగా మారిందని ఇక్కడి జనం మండిపడుతున్నారు. కొత్త ఉపాధి సరే, చేస్తున్న పనికే సమాధి కట్టిందట. పరిశ్రమ అడుగుపెట్టిన వేళా విశేషం ఏమిటోగానీ.. ఊళ్లోని పెద్ద రైతులు సైతం బికారులుగా మారిపోయారట. చాలామంది కూలీలుగా మారితే, పరిశ్రమ వ్యర్థాలతో కలుషితమైన నీళ్లు తాగి ఊళ్లకు ఊళ్లు మంచం పడుతున్నాయట. 'ఎందుకిలా?' ఇదే ప్రశ్నను ఇక్కడి యువకులను అడిగాను.

" పెద్ద పరిశ్రమ వస్తున్నదంటే మేమూ సంతోషించాం సార్. మా పెద్దవాళ్లకూ నచ్చజెప్పాం. కొలువులు వస్తాయని, మా ప్రాంతానికి కొత్త వెలుగులు వస్తాయని, సహజ వనరులు సద్వినియోగం అవుతాయని, రవాణా సౌకర్యాలు మెరుగుతాయని వాదించాం. 'అన్‌రాక్' రావడమైతే వచ్చిందిగానీ, మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు. మూడు వేల ఎకరాలు మింగి పట్టుమని మూడు ఉద్యోగాలైనా ఇవ్వలేదు'' అని వారు వాపోయారు. ఈ చీకటిని చీల్చితేనే వీళ్లకు వెలుగు!