April 19, 2013

బీసీలకు 50వేల కోట్ల ప్రణాళిక! ఏటా రూ.10 వేల కోట్లు ఇస్తా

వెయ్యి కోట్లతో చేనేత ప్రణాళిక
పేదలకు ఉచిత బియ్యం
విశాఖ పాదయాత్రలో చంద్రబాబు
రేపు వికలాంగుల మధ్య జన్మదినం

విశాఖపట్నం, మాకవరపాలెం: అధికారంలోకి వస్తే రూ.50 వేల కోట్లతో బీసీ ఉపప్రణాళిక అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఏటా పది వేల కోట్లు చొప్పున ఈ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించి..బలహీన వర్గాల ఉన్నతికి దోహదం చేస్తామని పేర్కొన్నారు. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం సుబ్బా రెడ్డిపాలెం వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. చంద్రయ్యపాలెం, గంగవరం, దాలింపేట, కొండల అగ్రహారం, మాచవరం పాలెం మీదుగా 10.2 కిలోమీ టర్లు నడిచారు.

జనాభాలో 50 శాతంగా ఉన్నా..బీసీలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని ఈ సంద ర్భంగా జరిగిన పలు సభల్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని సరిదిద్దేందుకు ప్రత్యేక ఉప ప్రణాళిక తీసుకువస్తామని చెప్పారు. స్థానిక సంస్థల్లో 50 శాతం సీట్లు, ఎన్నికల్లో వంద సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అవకాశం ఇస్తే ఐదేళ్లు సేవకుడిగా ఉంటానని ప్రజలను కోరారు. "రానున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.ప్రలోభాలకు, మాయమాటలకు లోను కావొద్దు'' అని చంద్రయ్యపాలెం- గంగవరం గ్రామాల్లో జరిగిన సభల్లో విజ్ఞప్తి చేశారు.

సీఎం కిరణ్ దోపిడీ సామ్రాజ్యం చిత్తూరు నుంచి హైదరాబాద్‌కు విస్తరించిందని దుయ్యబట్టారు. తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు అవినీతిలో కూరుకుపోయాయని విమర్శించారు. "ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి లేని ప్రజలు ఉన్న ఈ రాష్ట్రంలో జగన్ లక్ష కోట్ల ఆస్తి ఎలా సంపాదించార ు? వైఎస్, ఆయన కుమారుడి అవినీతిపై దర్యాప్తు జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు..మహ్మద్ గజనీకంటే ఘోరంగా దోచుకున్నట్టుగా నిర్ధారించారు'' అని గుర్తుచేశారు.

తెలుగుదేశం పార్టీ నిప్పులాంటిదని, ముట్టుకునేందుకుగానీ, ఆరోపణలు చేసేందుకుగానీ అవకాశం ఇవ్వబోమన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేదలకు ఉచిత బియ్యం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కిలో రూపాయి బియ్యం పథకాన్ని ఎగవేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం 'నగదు బదిలీ' తెస్తున్నదని దుయ్యబట్టారు. చేనేత కార్మికుల కోసం రూ. వెయ్యి కోట్లతో ప్రత్యేక ప్రణాళిక తీసుకొస్తామని చెప్పారు. ఆడపిల్ల పుట్టిన వెంటనే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా, శనివారం తన పుట్టినరోజు వేడుకలను ఆయన వికలాంగుల నడుమ జరుపుకోనున్నారు.