April 19, 2013

కాంగ్రెస్ అధిష్ఠానానికీ 'గని'పాపం సోనియాకు ముడుపు గట్టిన వైఎస్ గాలితో కలిసి సరిహద్దులు మాయం

అవినేతి వేళ్లు జగన్ ఇంట్లో!
పేద పిల్లలను చదివిస్తా: చంద్రబాబు
200 రోజుల పాదయాత్ర పూర్తి

విశాఖపట్నం, మాకవరపాలెం: ఆంధ్రా, కర్ణాటక ర్రాష్టాల్లో అక్రమ గనుల తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం ద్వారా కొల్లగొట్టిన డబ్బులో కొంత కాంగ్రెస్ హైకమాండ్‌కు వైఎస్ రాజశేఖరరెడ్డి ముడుపులుగా సమర్పించేవారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అవినీతి వృక్షం వేళ్లు వైఎస్, జగన్ ఇళ్లలోనే ఉన్నాయని విమర్శించారు. పాదయాత్రలో 200 రోజులు పూర్తిచేసుకొన్న ఆయన.. శుక్రవారం సాయంత్రం విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం తామరం వద్ద నడక ప్రారంభించారు.

రాచపల్లి జంక్షన్, రామన్నపాలెం, భీమబోయినపాలెం, దుంగలవానిపాలెం, శెట్టిపాలెం, రాజుపేట, పాతకన్నూరుపాలెం మీదగా యాత్ర సాగించారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీ అధిపతి గాలి జనార్దనరెడ్డి గనుల అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించిన ఆయన.. టీడీపీ పోరాటం ఫలించిందని వ్యాఖ్యానించారు. "గాలితో కలిసి వైఎస్.. కర్ణాటక, ఆంధ్రా ర్రాష్టాల్లో అక్రమ మైనింగ్ సాగించారు. ర్రాష్టాల సరిహద్దులనే చెరిపివేశారు. ఐదేళ్లలో 60 వేల కోట్ల ఖనిజ సంపదను దోచుకున్నారు. దీనిపై అప్పట్లోనే మా పార్టీ ఉద్యమాలు చేసింది. వాటి విషయమై వైఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చట్టవిరుద్ధమన్న విషయం కోర్టు తీర్పు ద్వారా స్పష్టమైంద''ని పేర్కొన్నారు.

మాకవరపాలెంలో 'అన్‌రాక్' కోసం రైతులను కూలీలుగా మార్చారన్నారు. బాధిత రైతులకు న్యాయం జరిగేవరకు తమ పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని, పంటలకు గిట్టుబాటు ధర లభించేలా వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వికలాంగుల పెన్షన్‌ని రూ.1500 కు పెంచుతామన్నారు. పేద పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కాగా, పాదయాత్రకు 200 రోజులు పూర్తయిన సందర్భంగా తా మరం గ్రామంలో చంద్రబాబు.. కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు.