April 19, 2013

ఆ పుత్రవాత్సల్యం కదిలించింది!

ఇల్లు విడిచి నేను, ఇంట్లో చోటు లేక వాళ్లు..జనం ముంగిట నేను, జీవితం ముగింపులో వాళ్లు...ప్రజల సేవకు నేను అంకితమయినట్టే, తమ పిల్లలు, వారి పిల్లల సుఖ సంతోషాల కోసమే వారు బతుకుతారు. సామాన్యుడికి చెయ్యి అందించాలని నేను తపించినట్టే, కొడుకును ఓ ఇంటివాడ్ని చేయడానికి ఈ వృద్ధులూ ఆరాటపడతారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా రాజకీయాల్లో నేను కొనసాగగలుగుతున్నాను.

కానీ, ఈ వయసులో వీళ్లు ఎటు పోవాలి? గూడు ఉంటుంది.. కుటుంబం ఉంది.. కొడుకూకోడలు ఉన్నారు.. ముద్దులొలికే మనవలు, మనవరాళ్లూ ఉన్నారు. లేనిదల్లా కాళ్లు చాపుకునే చోటే! ఈ యాత్రలో అలాంటి వృద్ధులను ఎందరినో చూశాను. స్వయంగా కలిసి పరామర్శించాను. పింఛను పెంచుతామని, వృద్ధాశ్రమాలు కడతామని చెబుతున్నాంగానీ, అదొక్కటే చాలదు కదా! దాలింపేటలో కొందరు వృద్ధులు కలిశారు. ఎంతో దగ్గర మనిషిని చూసినట్టు చూశారు. కంటిచూపు ఆనక దగ్గరగా వచ్చి హత్తుకున్నారు. పైన చేతులు వేసి ఆప్యాయంగా తడిమారు. వారి పుత్రవాత్సల్యానికి కదలిపోయాను.

నడక మొదలుపెట్టి 200 రోజులు. ఎండయినా, వానయినా ఈ ప్రజల మధ్యే అనుభవించాను. పేదవాడిని, దళిత వాడని నా చిరునామా చేసుకున్నాను. ఒక జిల్లా అని కాదు..ఒక గ్రామం అని కాదు. ఎక్కడికి వెళ్లినా సమస్యలు పుట్టల్లా పగిలాయి. హిందూపురం నుంచి నర్సీపట్నం వరకు సంతోషంగా ఉన్న ఒక్క కుటుంబాన్నీ చూడలేదు. యాత్ర దాదాపు చివరకు వచ్చేసింది. కానీ, ఈ ప్రజల యాతనలకు మాత్రం దరి దొరకడం లేదు. ఎంతెంత దూరం అంటే..చివరి కన్నీటిబొట్టును సైతం తుడిచేంతదూరం అనేదే సమాధానం!