April 12, 2013

మానభంగాలు.. హత్యల ప్రదేశ్‌గా రాష్ట్రం: ముద్దు, మోత్కుపల్లి

రాష్ట్ర మంత్రి వర్గం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 420
సమతా బ్లాక్‌కు జైలు హోదా ఇస్తే సరిపోతుంది
టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎద్దేవా
అంటువ్యాధిలా వ్యాపిస్తున్న అత్యాచారాలు: సన్నపనేని

హైదరాబాద్ : 'తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీస్ శాఖను సంప్రదించడానికి '100' సంఖ్యను టోల్ ఫ్రీ నెంబర్‌గా కేటాయించింది. తర్వాత వైద్య అవసరాల కోసం ఆయా శాఖలకు 108, 104 నెంబర్లు ఇచ్చారు. కిరణ్ సర్కారు ఇప్పుడు తన మంత్రివర్గానికి టోల్ ఫ్రీ నెంబర్‌గా 420 ని పెట్టుకొన్నట్లు కనిపిస్తోంది' అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన గురువారం ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

420 సెక్షన్ కింద కేసులు నమోదైన మంత్రులను మంత్రివర్గంలో పెట్టుకొని తిరగడం ఈ ముఖ్యమంత్రికే చెల్లిందని, దానం, ధర్మాన, పొన్నాల, కన్నా, గీత, సబిత, పార్దసారధి వంటివారు ఇంతకు తక్కువ కాదన్నారు. మంత్రివర్గ సమావేశాలు చంచల్‌గూడ జైలులో పెట్టుకొనే పరిస్థితి రాకుండా సచివాలయంలో సమతా బ్లాక్‌కు జైలు హోదా కల్పించి అక్కడే మంత్రులను ఉంచితే సరిపోతుందని ఎద్దేవా చేశారు. 'చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పోచారం శ్రీనివాసరెడ్డిపై పత్రికల్లో వార్తలు వస్తేనే ఆయనతో రాజీనామా చేయించారు. గతంలో మంత్రులపై అనుమానం వస్తే రాజీనామా చేయించేవారు.

తర్వాత కేసులు నమోదు అయితే రాజీనామా చేయించేవారు. ఇప్పుడు ఏకంగా ఛార్జిషీట్లు దాఖలు చేసి 420 సెక్షన్ల కింద కేసులు పెట్టినా పదవుల నుంచి తప్పుకోవడం లేదు' అని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత అధ్వాన్న మంత్రివర్గాన్ని పెట్టుకున్న ముఖ్యమంత్రి మరొకరు లేరని, ఘనత వహించిన మంత్రులకు ఉగాది సందర్భంగా 420 పురస్కారాలు కూడా అందచేస్తే ప్రజలు మరింత సంతోషించేవారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళంకిత మంత్రులను తప్పించాలని, లేకుంటే తామే పోరాటం చేసి తీరుతామని రేవంత్ హెచ్చరించారు.

తాము మంత్రులపై ఆరోపణలు చేయడం లేదని, వారిపై దర్యాప్తు పూర్తయి ఛార్జిషీట్లు కూడా దాఖలు అయినందువల్లే రాజీనామాలు కోరుతున్నామని రేవంత్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మరోవైపు పార్టీ శాసనసభాపక్ష ఉప నేతలు ముద్దు కృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు రాష్ట్రంలో మహిళలపై సాగుతున్న అరాచకాలపై ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ భవన్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ అధ్వాన్న పాలనతో రాష్ట్రాన్ని మానభంగాలు.. హత్యల ప్రదేశ్‌గా మార్చిందంటూ కాంగ్రెస్‌ను విమర్శించారు. తెనాలిలో ఓ మహిళను యువకులు లారీ కింద తోసి చంపిన ఘటన మరువకముందే రంగారెడ్డి జిల్లాలో ఓ విద్యార్థినిని కాల్చి చంపేసిన ఘటన.. రాష్ట్రంలో పరాకాష్టకు చేరిన అరాచకాలకు నిదర్శనమన్నారు.

ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పక్షవాతం వచ్చినట్టు ప్రవర్తిస్తోందని విమర్శించారు. 'ఉగాది పండగ రోజు కూడా మహిళలపై ఘోరాలు ఆగలేదు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది. వైఎస్ గుండా రాజ్‌ను నెలకొల్పి వెళ్తే కిరణ్ చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తున్నారు' అని ముద్దు విమర్శించారు. ప్రభుత్వంలో పదవుల్లో ఉన్నవారు దోచుకొని తింటుంటే కింద వారి అనుచరులు రేపులు, రౌడీయిజం, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మోత్కుపల్లి విమర్శించారు.

సీబీఐ కేసులు పెట్టిన మంత్రులను కూడా అరెస్టు చేయకపోవడంతో రాష్ట్రంలో ప్రభుత్వం అంటే ఎవరికీ భయం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎప్పుడు వచ్చినా ప్రజలకు అన్యాయమే జరుగుతోందన్నారు. పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ఆడవాళ్లపై అత్యాచారాలు ఓ అంటువ్యాధిగా వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 'మహిళలపై అత్యాచారాల నిరోధానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను, ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన తక్షణ అవసరం ఉంది. అలాంటి వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పించాలి' అని నన్నపనేని డిమాండ్ చేశారు.