April 12, 2013

టీడీపీకి దూరమయ్యే ప్రశ్నే లేదు: జూనియర్ ఎన్టీఆర్

పార్టీ కోరితే ఎన్నికల్లో ప్రచారం!

హైదరాబాద్ : పార్టీ అధినాయకత్వం కోరితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల వ్యవహారం ఇటీవల టీడీపీలో కలకలం సృష్టించిన నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు కొద్ది రోజుల క్రితం ఆయనను కలిసి తాజా పరిణామాలపై మాట్లాడారు.

"పార్టీకి నేను దూరమయ్యే పరిస్థితే లేదు. ఆ విషయంలో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ కోరితే ఎన్నికల్లో ప్రచారానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను'' అని ఆయన వారితో అన్నారు.వైసీపీకి చెందినవారు ఇటీవల కోస్తా ప్రాంతంలో అక్కడక్కడా వారి ఫ్లెక్సీలపై తన ఫొటోను వాడుకోవడం కేవలం ప్రచారం కోసం చేసిన వ్యవహారం అని తాను అనుకొంటున్నానని, దానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదల్చుకోలేదని ఆయన చెప్పారు.తాను రోజువారీ రాజకీయాల్లో లేనని, ఎక్కడో, ఎవరో ఫ్లెక్సీలు పెడితే ఖండనలు ఇస్తూ ఎలా కూర్చోగలనని ఆయన ప్రశ్నించారు.

గుడివాడ ఎమ్మెల్యే నాని తన అనుమతితోనే పార్టీ మారాడన్న ప్రచారం నిజం కాదని ఎన్టీఆర్ చెప్పారు. "టీడీపీ నాయకత్వంపై నాని విమర్శలు చేసినప్పుడు నేను ఖండించి ఉండాల్సిందని కొందరు అంటున్నారు. పార్టీ మారిన వారిలో చాలా మంది చాలా మాటలు మాట్లాడారు. అవన్నీ నేను ఎక్కడ పట్టించుకోగలను? వారి విమర్శలకు పార్టీ నేతలు సమాధానం ఇచ్చారు. నేను అందులో తలదూర్చదల్చుకోలేదు'' అని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో తనకు ఏ సమస్యలు లేవని, ఎన్టీఆర్ కుటుంబంలోని పెద్దల మధ్య అభిప్రాయ భేదాలకు కారణం అవుతున్న అంశాల జోలికి తాను వెళ్ళదల్చుకోలేదని ఆయన చెప్పారు. ఫ్లెక్సీల వ్యవహారంలో తన బాబాయి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఆయన కొంత నొచ్చుకొన్నట్లు కనిపించిందన్నది టీడీపీ నేతల కథనం. టీడీపీ నేతల విజ్ఞప్తి తర్వాతే జూనియర్ ఎన్టీఆర్ ఓ కార్యక్రమంలో తాను ఎప్పటికీ టీడీపీ వాడినేనని వ్యాఖ్యానించినట్లు సమాచారం.