April 12, 2013

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం ప్రారంభమవుతోంది. ఆయన తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లిలో యాత్ర ముగించుకొని సాయంత్రం విశాఖ జిల్లా నాతవరం మండలం గన్నవరం మెట్టలో అడుగుపెడతారు. అక్కడ ఆయనకు స్వాగతం పలికేందుకు జిల్లా నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో బాబు యాత్ర 12వ తేదీన మొదలై 27వ తేదీన ముగుస్తుంది.

ఈ 15 రోజుల్లో 112 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. మొత్తం ఆరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటారు. పాదయాత్ర ముగింపు చిహ్నంగా పైలాన్ ఆవిష్కరణకు పార్టీ నిర్ణయించింది. గాజువాక సమీపానున్న వడ్లపూడిలో 1000 గజాల స్థలంలో 70 అడుగుల ఎత్తైన పైలాన్ నిర్మాణానికి గురువారం ఉదయం శంకుస్థాపన జరిగింది.

చంద్రబాబు విశాఖపట్నం జిల్లా యాత్రలో అన్నీ విశేషాలే చోటుచేసుకోనున్నాయి. ఆయన పుట్టిన రోజు ఇక్కడే జరగనుంది. అలాగే 200వ రోజు యాత్ర కూడా ఈ జిల్లాలోనే జరుగుతుంది. శ్రీరామనవమి వేడుకలు కూబా బాబు విశాఖ జిల్లా వాసుల మధ్యే జరుపుకొంటారు. వస్తున్నా మీకోసం యాత్రను జిల్లాలోనే ముగించి, అందుకు చిహ్నంగా గాజువాకలో పైలాన్ ఆవిష్కరిస్తారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల వేదిక కానుంది.

వర్గ విభేదాలు...నాయకత్వ సమస్యలు

బాబు యాత్ర కోసం పార్టీ నాయకులు, శ్రేణులు చాలా ఉత్సాహంగా వేచిచూస్తున్నాయి. ఈ యాత్రను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు గత పదిహేను రోజుల నుంచి ఏర్పాట్లతో నిమగ్నమయ్యారు. జిల్లా ప్రధాన నాయకుల మధ్య సమన్వయం లేకపోయినా అటు జిల్లా కన్వీనర్ దాడి రత్నాకర్, ఇటు నగర కన్వీనర్ వాసుపల్లి గణేశ్‌కుమార్‌లు ఎవరినీ నొప్పించకుండా అందరినీ కలుపుకొంటూ యాత్రకు ఏర్పాట్లు చేశారు. పర్యటన సందర్భంగా పార్టీ అధినేత జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను సమీక్షించి తగిన చికిత్స చేయాల్సి ఉంది. ముఖ్యంగా కీలకమైన ఎలమంచిలి, గాజువాక, భీమిలి, పాడేరు నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్యలు ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అందరినీ ఏకతాటిపైకి తెచ్చి కలుపుకొని వెళ్లేలా సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలమంచిలిలో లాలం భాస్కరరావు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే అక్కడ సుందరపు విజయకుమార్ కూడా ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నాయకులతో పాటు జిల్లా పార్టీ పెద్దలు కూడా సుందరపునే ప్రోత్సహిస్తున్నారు. ఇది సహించలేదని లాలం తాను ఇన్‌చార్జి పదవి నుంచి తప్పుకుంటానని గొడవ చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉంది. పాడేరులో పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదంటున్నారు. మాజీ మంత్రి మణికుమారి ఒంటరి కావడంతో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా సాగడం లేదు. బొర్రా నాగరాజు, మాజీ ఎమ్మెల్యే ఎంవీవీ సత్యనారాయణ తనయుడు ప్రసాద్ ఆమెకు పోటీగా తయారయ్యారు. దాంతో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు ఎవరీకి కట్టబెట్టలేదు. ఈ ముగ్గురితో కమిటీ వేసి కాలక్షేపం చేస్తున్నారు. దీనిపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఇక నగరంలో కీలకమైంది గాజువాక. ఇక్కడ ఐదుగురు సభ్యుల కమిటీతోనే ఏళ్లుగా పార్టీ నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా గుడివాడ నాగమణి, కోన తాతారావు, హర్షవర్దన్, కాకి గోవింద్‌రెడ్డి, పల్లా శ్రీను, లేళ్ల కోటేశ్వరరావులు పోటీ పడుతున్నారు. వీరు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు చేపడుతున్నారు.

కొన్నిసార్లు వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. ఇక్కడ మధ్యేమార్గంగా ఏదో ఒకటి చేసి పార్టీని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. ఇక భీమిలి నియోజకవర్గం అనాధగా మారింది. ఎప్పటి నుంచో ఉన్న మాజీ ఎమ్మెల్యే అప్పలనరసింహరాజును కాదని గత ఎన్నికల్లో ఆంజనేయరాజుకు పోటీ చేసే అవకాశం కల్పించారు. ఆయన ఇటీవల వైఎస్ఆర్ పార్టీలోకి మారిపోయారు. దాంతో పార్టీకి ఇన్‌చార్జి లేకుండా పోయారు. తక్షణమే ఈ ఖాళీని భర్తీ చేసి ఇతర పార్టీలకు ధీటుగా కార్యక్రమాలు చేపట్టి భీమిలి తెదేపాకు కంచుకోట అని మరోసారి నిరూపించాల్సిన సమయం వచ్చింది.

ఇదిలావుంటే జిల్లాలో ప్రధాన నాయకుల మధ్య సఖ్యత లేదు. వీరంతా ఒకే కార్యక్రమానికి హాజరు కావడం చాలా అరుదు. ఈ నాయకుల్ని ఓ తాటి మీదకు తెచ్చి సభలు, సమావేశాలు నిర్వహించడం అటు జిల్లా కన్వీనర్‌కు, ఇటు నగర కన్వీనర్‌కు తలకు మించిన భారమవుతోంది. దీన్ని కూడా సరిదిద్దాల్సి ఉంది.