April 12, 2013

2014 చావో..రేవో.. ఆఖరిపోరాటం

సర్వశక్తులూ ఒడ్డిపోరాడదాం
కాంగ్రెస్, వైసీపీల అవినీతి, అరాచకాలపై పుస్తకాలు
కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ఉద్భోద

కాకినాడ:రాజీపడే మనస్తత్వం కాదు నాది.. పాదయాత్ర కొనసాగిస్తా:
చిత్తశుద్దితో చేపట్టిన పనుల్లో ఒక్కోసారి ఇబ్బందులు వస్తాయి. సమున్నత లక్ష్యం కోసం చిన్న చిన్న ఆటంకాలు, సమస్యలు ఆటంకాలుకాకూడదు. నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే రాజీపడలేను. కాళ్లు నొప్పిపుట్టినా పాదయాత్ర ఆపను. డాక్టర్లు వద్దని సలహా ఇస్తున్నారు. చిటికెనవేలు బాగా ఇబ్బందిపెడుతోంది.క్రానిక్ అవుతుందని డాక్టర్లు చెప్పారు. అయినా మీ సమస్యల ముందు నాది పెద్ద సమస్యకాదు.. అని చంద్రబాబు కార్యకర్తలతో అన్నారు. తాను అధికారంలోకి వస్తే విలేకరులకు ఇంటి స్థలాలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈసందర్భంగా తూర్పుగోదావరి జిల్లా డిక్లరేషన్‌ను చంద్రబాబు వివరించారు. పోలవరం, పుష్కర, ఏలేరు, గోదావరి ఆధునికీకరణ, కాకినాడ, రాజమండ్రి ఐ.టి. అభివృద్ధి తదితర హామీలను చంద్రబాబు ప్రకటించారు.

కాంగ్రెస్, వైసీపీల అవినీతి, అరాచకాలపై పుస్తకాలు
కాంగ్రెస్ చేతకాని పాలన, అవినీతిపైనా, వైసీపీ అక్రమాలు, అరాచకాలపైనా పుస్తకాలు ప్రచురించి విస్తృత ప్రచారం చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కార్యకర్తలు కూడా పత్రికలలో వచ్చే కథనాలు, ఎస్ఎంఎస్‌ల ద్వారా కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఆగడాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

తూర్పులో ముగిసిన బాబు పాదయాత్ర
అక్టోబరు రెండున హిందూపూర్‌లో ప్రారంభమైన చంద్రబాబు నాయుడు పాదయాత్ర శుక్రవారం నాటికి 193 రోజులయింది. మార్చి 20న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి చేరుకున్న చంద్రబాబు 24 రోజులు ఇక్కడ యాత్ర సాగించారు. 11 నియోజకవర్గాలు, 16 మండలాలు, 78 గ్రామాలలో చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా 19 నియోజకవర్గాల సమీక్షతోపాటు.. కాపు, శెట్టిబలిజ, బ్రాహ్మణ తదితర సామాజిక వర్గాల సమావేశాలలోనూ చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబు 24 రోజులలో తూర్పుగోదావరి జిల్లాలో 243.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

కాపులకు రూ.5 వేల కోట్ల ప్యాకేజీ
తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు కీలకమైన హామీ ఇచ్చారు. కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండటంతో.. కాపులలో పేదల కోసం ఏటా రూ వెయ్యికోట్ల చొప్పున ఐదేళ్లలో ఐదువేల కోట్ల ప్యాకేజీని పిఠాపురం సభలో ప్రకటించారు. కాపుల ప్యాకేజీకి అనూహ్యస్పందన వచ్చింది.

యాత్ర కొనసాగిస్తే బాబుకు శాశ్వత ఇబ్బందులు తప్పవు: డాక్టర్ రాకేష్
చంద్రబాబు సుదీర్ఘ పాదయాత్ర వల్ల కాళ్లు, కండరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తాయని ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రాకేష్ తెలిపారు. శుక్రవారం ఉదయం రెండుగంటలపాటు చంద్రబాబుకు వైద్యపరీక్షలు నిర్వహించిన రాకేష్ అనంతరం మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర కొనసాగిస్తే కాలుకు సంబంధించి శాశ్వతంగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని చంద్రబాబుకు చెప్పామన్నారు. కనీసం రెండు రోజులు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చామన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్ర నాయకులతో చర్చించి యాత్రపై నిర్ణయం తీసుకుంటామన్నారు. చంద్రబాబు మాత్రం మొండిగా నడుస్తానంటున్నారని తెలిపారు.
: కార్యకర్తలంతా జెండాలు మోసీ మోసీ అసిపోయి ఉన్నారు. ఇంకెన్నాళ్లని మోస్తారు. 2014 ఎన్నికలలో ఎట్టిపరిస్థితులలోనూ గెలిచి తీరాల్సిందే. సర్వశక్తులూ ఒడ్డి పోరాడాల్సిన ఎన్నికలు రాబోతున్నాయ్. ఇది ఫైనల్ ఎలక్షన్.. అని చంద్రబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఒక విధంగా ఇది ఆఖరిపోరాటం అన్న సంకేతాలు ఇచ్చారు. అవసరమైతే పార్టీ కోసం కొంత సొమ్ము ఖర్చుచేయాలని విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ఆవేశపూరితంగా ప్రసంగం చేశారు. 2014 ఎన్నికలలో అతి పెద్ద మెజార్టీ సాధించాలని .. సీట్లే కాకుండా..నియోజకవర్గాలలో ఓట్లూ భారీగా వచ్చేలా ఇప్పటి నుంచీ ప్రయత్నం చేయాలన్నారు.