April 12, 2013

గుంటూరులో టీడీపీ ఎమ్మెల్యేల అరెస్టులు

గుంటూరు : కళంకిత మంత్రులను కేబినెట్ నుంచి భర్త్‌రఫ్ చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని నిలదీసేందుకు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం సీఎం గుంటూరులోని ఫిరంగిపురంలో ఇందిరమ్మ కలలు బహిరంగ సభలో పాల్గొనేందుకు వస్తున్నారని తెలుసుకొన్న టీడీపీ ఎమ్మెల్యేలు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ విషయం ముందుగానే తెలుసుకొన్న పోలీసులు టీడీపీ కార్యాలయంలో మకాం వేసి ఎవరినీ ముందుకు కదలనివ్వలేదు.

సీఎం పర్యటనలో పాల్గొనేందుకు తమకు ఆహ్వానం ఉందని ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, జీ వీ ఆంజనేయులు, నక్కా ఆనంద్‌బాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ వాదించినప్పటికీ పోలీసులు ఆలకించలేదు. తమకు అర్బన్, రూరల్ ఎస్‌పీల నుంచి ఆదేశాలు ఉన్నాయని, టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం సభ వద్దకు వెళితే గొడవ జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అడ్డుకొంటున్నామని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్యన తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అనంతరం ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు ముందుకెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్రస్థాయిలో పెనుగులాట జరిగింది. ఆ తర్వాత పోలీసులు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి బలవంతంగా వాహనాల్లో పోలీసుస్టేషన్‌కు తరలించారు.

సుమారు నాలుగు గంటల పాటు పోలీసుస్టేషన్‌లో నిర్బంధించి సీఎం హెలికాఫ్టర్ గుంటూరును వీడిన తర్వాత ఎమ్మెల్యేలను స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా టీడీపీ చీఫ్‌విప్, ఎమ్మెల్యే నరేంద్ర మాట్లాడుతూ నిందితులైన మంత్రులను కాపాడుతూ సీఎం ప్రథమ నిందితుడిగా మారుతున్నారని ఆరోపించారు. గవర్నర్ కళంకిత మంత్రుల విషయంలో ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పోలీసుల అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, మంత్రులను కేబినెట్ నుంచి తొలగించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.