April 12, 2013

ముఖ్యమంత్రికి టీడీపీ ఎమ్మెల్యేల సెగ

గుంటూరు : ఫిరంగిపురం పర్యటనకు నేడు(శుక్రవారం) ఉదయం రానున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలుగుదేశం పార్టీ నిరసన సెగ తగలనుంది. హైకోర్టుకు సీబీఐ సమర్పించిన ఛార్జీషీట్లలో నిందితులుగా ఉన్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డిని తక్షణం కేబినెట్ నుంచి తొలగించాలన్నదే టీడీపీ ఎమ్మెల్యేల ప్రధాన డిమాండ్‌గా ఉన్నది. ఇప్పటికే సీఎం క్యాంపు ఆఫీసును ముట్టడిస్తామని టీడీపీ రాష్ట్ర నాయకులు గాలి ముద్దుమకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఫిరంగిపురంలో సీఎంను అడ్డుకొని అవినీతి మంత్రులను తొలగించాలని డిమాండ్ చేసేందుకు ఎమ్మెల్యేలు సన్నద్ధమయ్యారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో రహస్య సమావేశం నిర్వహించారు. అలానే ఇతర ఎమ్మెల్యేలతో ఫోన్‌లో సంభాషించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించకుండా సీఎం తాత్సారం చేస్తుండటంపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు కిరణ్ కేబినెట్‌లో బందిపోటు దొంగలున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అలానే ఎమ్మెల్యేలు పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పలుమార్లు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల విషయంలో సీఎం తీరును ఆక్షేపించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆరుగురిని తొలగించాలని డిమాండ్ చేశారు. అలానే వారికి ప్రభుత్వం తరుపున అందజేస్తోన్న న్యాయసాయం పైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఫిరంగిపురంలో సీఎం పాల్గొనే కార్యక్రమాల వద్దకు వెళ్లి అవినీతి మంత్రులను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ అడ్డుకోవాలని పుల్లారావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు నిర్ణయించారు. దీంతో ఫిరంగిపురంలో ఉత్కంఠ నెలకొన్నది. సీఎం పర్యటనను అడ్డుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు వ్యూహం రచిస్తున్నారన్న విషయం తెలుసుకొన్న పోలీసు, అధికారవర్గాలు ఎలాగైనా వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.