April 25, 2013

మహిళే మహాలక్ష్మి...........భ్రూణ హత్యల నివారణకు కఠిన చట్టాలు

ఆడపిల్ల పుట్టగానే 25 వేల డిపాజిట్
పెళ్లి నాటికి రూ.2 లక్షలు అందిస్తాం
మహిళలకు లక్షలోపు వడ్డీలేని రుణాలు
విద్యార్థినులందరికీ ఉచితంగా సైకిళ్లు
పని ప్రదేశాల్లో వేధింపులకు అడ్డుకట్ట
చంద్రబాబు మహిళా డిక్లరేషన్



డ్వాక్రా రుణభారం తగ్గించే చర్యలు తీసుకుంటామని, మహిళలకు లక్ష లోపు వడ్డీలేని రుణాలు ఇస్తామని, ఏడాదికి పది సిలిండర్లు సబ్సిడీపై అందిస్తామని, బెల్టుషాపులు రద్దుచేస్తామని, విద్యార్థినులందరికీ ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఆడపిల్లలకు సమాన విద్యావకాశాలు, చట్టసభ ల్లో మహిళా రిజర్వేషన్లు అమలుచేస్తామన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులకు అడ్డుకట్టపడేలా చర్యలు తీసుకుంటామని, అత్యాచారాల నిరోధానికి, ఈవ్‌టీజింగ్ నివారణకు ప్రత్యేకదళం ఏర్పాటుచేస్తామని, భ్రూణహత్యల నివారణకు కఠిన చట్టాలు చేస్తామని, బాలికా శిశు సంరక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మహిళల ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేస్తామని, గ్రామీణ మహిళల ఆర్థికాభ్యున్నతికి డ్వాక్రా అమలును పటిష్ఠం చేస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి బాటలు వేస్తామని, ఎదిగిన ఆడపిల్లలకు కుట్టు, వస్త్ర పరిశ్రమల్లో శిక్షణ ఇప్పిస్తామని, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోనూ వారిని ప్రోత్సహిస్తామని వివరించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంతో మంచినీటి సమస్యను తీరుస్తామన్నారు.చక్రం తిప్పేది మనమే కేంద్రంలో, రాష్ట్రంలో ఈసారి చక్రం తిప్పేది టీడీపీయేనని ధీమా వ్యక్తంచేశారు. టీడీపీ చెప్పినవారే ప్రధాని అవుతారని, తమపార్టీ ఎవరికి మద్దతిస్తే వారే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్నారు. జైలుకు పోయే పార్టీ మనకు వద్దన్నారు.

తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అవినీతి ఊబిలో కూరుకుపోయాయన్నారు. మరో పార్టీ టీఆర్ఎస్ 2014 ఎన్నికల్లో గల్లంతవుతుందన్నారు. ఇది దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యమని, పనికిమాలిన ప్రభుత్వమని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాంకీ, ఫార్మాసిటీ, బ్రాండిక్స్ వంటి సంస్థల్లో లక్షలాదిమందికి ఉపాధి కల్పించాల్సి ఉండగా, కనీసం వేలల్లో కూడా కల్పించలేదన్నారు. లక్ష కోట్లు మింగినందుకు రాష్ట్రంలో వైఎస్ విగ్రహాలు లక్ష ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. తప్పుడు కంపెనీలతో లక్ష కోట్లు సేకరించి కొడుకును జైలుకు పంపిన ఘనత కూడా వైఎస్‌దేనన్నారు.

ప్రజలు దగా పడ్డారని, అవినీతి ప్రభుత్వం నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టే తాను 'మీ కోసం' పాదయాత్ర చేస్తున్నానన్నారు. ఒక కుటుంబం తప్పులకు రాష్ట్రం పరువు పోయిందన్నారు. పిల్ల కాంగ్రెస్‌లో చేరడానికి కొందరు చం చల్‌గూడ జైలుకు వెళ్లి కొబ్బరికాయ కొట్టి వస్తున్నారని, అలాంటి నేతలకు బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ ఎప్పుడూ గాలి జనార్దన్‌రెడ్డిని తన పెద్ద కుమారుడిగా, జగన్‌ను రెండో కుమారుడిగా చెప్పుకొనేవారని, ప్రస్తుతం ఇద్దరూ జైలు ఊచలు లెక్కబెడుతున్నారన్నారు. సింహాచలం అప్పన్నస్వామికి బంగారు ఊయల లేకపోయినా.. గాలి జనార్దన్‌రెడ్డి ఒళ్లు, ఇళ్లు అన్నీ బంగారంతో నిండిపోయాయన్నారు.

వైఎస్, గాలి ఎంత సంపాదించినా తినలేని పరిస్థితి ఉందన్నారు. ఫోక్స్‌వేగన్ కుంభకోణంలో ప్రజల సొమ్ము మింగిన ఆ కంపెనీ ప్రతినిధి షూష్టర్ ప్రస్తుతం జైల్లో ఉండగా అందులో ప్రధాన పాత్రధారి, లిక్కర్ డాన్ బొత్స సత్యనారాయణ కు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ముద్దాయిగా సీబీఐ పేర్కొన్నా హోంమంత్రి ఇంకా పోలీసులకు ఆదేశాలు జారీచేయడం సిగ్గుచేటన్నారు.

చంద్రబాబు గురువారంతో 2800 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు. విశాఖజిల్లా సబ్బవరం మండలం అమృతపురంలో అడుగుపెట్టడంతో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భం గా పెందుర్తి పార్టీ ఇన్‌చార్జి బండారు సత్యనారాయణమూర్తి నేతృత్వంలో నేతలు స్వాగతం పలికారు. 'చంద్రబాబునాయుడుకు శుభాకాంక్షలు' అంటూ కాంతినిచ్చే బాణాసంచా కాల్చారు.
విశాఖపట్నం : పాదయాత్ర పరిసమాప్తికి రెండు రోజులముందు టీడీపీ అధినేత చంద్రబాబు అతివల ను ఆకట్టుకునేందుకు యత్నించారు. మహిళలే మహాలక్ష్ములంటూ మహిళా డిక్లరేషన్ ప్రకటించారు. విశాఖ జిల్లా సబ్బవరంలో గురువారం రాత్రి భారీ సభలో ఆయన మహిళలకు ఉద్దేశించిన పలు పథకాలను వివరించారు. పుట్టిన ప్రతి ఆడపిల్లకు రూ.25వేలు డిపాజిట్ చేసి, 'మహాలక్ష్మి' పథకంతో పెళ్లీడు వచ్చేసరికి రూ.2లక్షలు అందిస్తామని ప్రకటించారు.