April 25, 2013

'వస్తున్నా మీకోసం'కు ప్రత్యేక రైలు

అనంతపురం అర్బన్ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి జిల్లానుండి తరలివెళ్లడానికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు పార్టీ జిల్లానేతలు తెలిపారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, జిల్లా ప్రధాన కార్యదర్శి వరదాపురం సూరి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.

వస్తున్నా మీకోం పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని ఈనెల 27వ తేదీన విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారన్నారు. జిల్లానుంచి కూడా తరలివెళ్లడానికి పార్టీతరపున ప్రత్యేక రైలు ఏర్పాటు చేశామన్నారు. 26న మధ్యా హ్నం 3 గంటలకు ధర్మవరం రైల్వేస్టేషన్‌లో బయల్దేరుతుందన్నారు. అనంతపురం, గుత్తి, గుంతకల్ మీదుగా వైజాగ్‌కు వెళ్తుందన్నారు. 27న ఉదయం 10 గంటలకు వైజాగ్‌కు చేరుకుంటుందన్నారు. అక్కడ సమావేశం ముగిసిన తర్వాత అదేరోజు రాత్రి 11 గంటలకు అదేరైలు తిరిగి అనంతకు బయల్దేరుతుందన్నారు. 28న సాయంత్రం జిల్లాకు చేరుకుంటుందన్నారు. జిల్లానుంచి వేళ్లేవారికి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైలులో వెళ్లేటపుడు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. అయితే యాత్రకు తరలివచ్చే ప్రతినాయకుడు, కార్యకర్త, అభిమాని విధిగా పచ్చ చొక్కాతో రావాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. జిల్లానుంచి దాదాపు 5వేల మందిదాకా వెళ్తున్నామన్నారు. ఏ నాయకుడూ చేయని సాహసం చేసి చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారన్నారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. జిల్లానుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి, విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో తెలుగుదేశం నేతలు, అనంతపురం ఇన్‌చార్జ్ మహలక్ష్మి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు నెట్టెం వెంకటేష్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.