April 25, 2013

అభ్యర్థుల గెలుపే లక్ష్యం

నెల్లూరుజిల్లాలో తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికలలో విజయకేతనం ఎగురవేసేలా సమష్టిగా కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం పార్టీ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నేతలు కృషి చేయాలన్నారు. గ్రామస్థాయి నుంచే పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని సూచించారు.

ప్రతీ మండల కేంద్రాలలోనూ మే నెల 31వ తేదీ లోపు పార్టీ కార్యాలయాలకు ఏర్పాటు చేయాలని తెలియచేశారు. ప్రతీ నెల 6వ తేదీన ఆయా కార్యాలయాలలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పటిష్ఠతపై చర్చించాలని తెలిపారు. విద్యుత్ విధానాలపై తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంతకాల సేకరణకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. సేకరించిన సంతకాల ప్రతులను జిల్లా కార్యాలయానికి చేర్చాలన్నారు. చంద్రబాబుపాదయాత్ర ముగింపు సందర్భంగా వైజాగ్‌లో నిర్వహించే భారీ సదస్సుకు జిల్లా నుంచి రెండు ప్రత్యేక రైళ్లు వేశామని, వీటితో పాటు కార్లు, బస్సుల్లోనూ కార్యకర్తలు వచ్చేలా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను టీడీపీ వ్యతిరేకిస్తుందన్న ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రంరెడ్డి గోవర్దన్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చేవూరి విజయమోహన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, మండలస్థాయి అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.