April 25, 2013

సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ విఫలం

నల్లగొండ రూరల్: అవినీతి కుంభకోణాల్లో మునిగి తేలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఐదు రోజులుగా నల్లగొండ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న టీడీపీ సైకిల్ యాత్ర బుధవారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా గడియారం సెంటర్‌లో జరిగిన సభలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. రాష్ట్ర క్యాబినెట్ నేరగాళ్ల మయమైందని, ఆ ముఠాకు నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలారన్నారు. పాలకులు కోర్టులు, జైళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని, ఎప్పుడు ఎవరు జైలుకు వెళ్లాల్సి వస్తుందోనని వణుకుతూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు.

విద్యుత్, పెట్రో ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని వేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి పోవాలంటే ప్రజల్లో ప్రశ్నించే చైతన్యం రావాలన్నారు. నల్లగొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ కోతలు, లో ఓల్టేజీలతో పంటలు ఎండిపోయిన పరిస్థితి దాపురించిందని, తాగునీటి కోసం జాగారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిమారాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా గెలిపించాలని పిలుపునిచ్చారు.

అంతకుముందు సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా స్థానిక భాస్కర్ థియేటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం టీడీపీ కార్యాలయానికి ర్యాలీగా వచ్చిన సైకిల్ యాత్ర బృందానికి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్, జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్, ఎమ్మెల్యే చందర్‌రావు, బొర్రా సుధాకర్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆవుల రాములు, తుమ్మల మధుసూదన్‌రెడ్డి, ఎల్‌వీ యాదవ్, బోదనం వెంకట్‌రెడ్డి, కొత్తపల్లి శ్రీను, తోట శ్రీనివాసాచారి, కూరెళ్ల విజయ్‌కుమార్, ఆకునూరి సత్యనారాయణ, గుండు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.