April 25, 2013

కాపులను ఆకట్టుకున్న చంద్రబాబు

విశాఖపట్నం: జిల్లాలో అధికసంఖ్యలో వున్న కాపులు ఇతర వెనుకబడిన కులాల వారి దృష్టిని ఆకర్షించేందుకు చంద్రబాబు తన పాదయాత్రలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వస్తున్నా... మీ కోసం పాదయాత్రలో భాగంగా చంద్రబాబునాయుడు అనకాపల్లి మండలంలోని శంకరం నుంచి బుధవారం బయలుదేరి సబ్బవరం మండలంలోని అసకపల్లి సున్నంబట్టీల వద్దకు చేరే సరికి అర్ధరాత్రి దాటింది. జాతీయ, రాష్ట్ర, స్థానిక సమస్యలను తన ప్రసంగాల్లో ప్రముఖంగా ప్రస్తావిస్తూ వస్తున్న చంద్రబాబునాయుడు విశాఖజిల్లాలో అధికసంఖ్యలో వున్న కాపులను ఆకట్టుకునేందుకు వారి సంక్షేమం కోసం తాము అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు.

గత ఎన్నికల్లో కాపులు పార్టీకి దూరమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వారికి పలు పథకాలను ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ఈసారి అధికారంలోకి వస్తే కాపులకు అన్నింటా పెద్దపీట వేస్తామనే అభిప్రాయాన్ని కలిగించారు. ఇది మంచి ఫలితాలను ఇస్తుందని ఆపార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేయడం విశేషం. అనకాపల్లి నియోజకవర్గంలో బుధవారం చంద్రబాబు తన పాదయాత్రను పూర్తిచేశారు. పెందుర్తి నియోజకవర్గంలో ప్రవేశించిన ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది.

చల్లని వర్షపు వాతావరణం ఆహ్లాదకరంగా మారి చంద్రబాబు సభలకు అనుకూలంగా త
యారైంది. అనకాపల్లి ఎంపీకి అయారం... గయారంలా తయారయ్యారని చంద్రబాబు వ్యాఖ్యానించినప్పుడు ప్రజల నుంచి పెద్ద హర్షధ్వానాలు వెలువడ్డాయి. కాంగ్రెస్, పిల్లకాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించినప్పుడు ప్రజల అనుకూల స్పందన వస్తుండడంతో చంద్రబాబు ప్రసన్నంగా వున్నారు. విశాఖజిల్లాతో, ఇక్కడ నాయకులతో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు పదే పదే గుర్తు చేసుకోవడం ఈ ప్రాంత వాసులను మెచ్చుకొనడం స్థానికులకు ఆనందాన్నిచ్చింది. చంద్రబాబు పర్యటన విజయవంతం కావడంతో ఆపార్టీనాయకులు దాడి రత్నాకర్, బండారు సత్యనారాయణమూర్తిలు ఆనందం వ్యక్తం చేశారు.