June 29, 2013

వైకాపాలో నమ్ముకుని పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోయారు.


నెల్లూరు జిల్లాలోనూ వైకాపాలో ధిక్కారస్వరం తారస్థాయికి చేరింది. అక్కడ మేకపాటి సోదరులకు వ్యతిరేకంగా చిరంజీవిరెడ్డి వేరుకుంపటిని పెట్టుకున్నారు. మేకపాటి సోదరుల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడటానికే రాజన్నదళం పేరిట ప్రత్యేక సంస్థను ఆయన ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. చిరంజీవిరెడ్డికి ఉదయగిరి నియోజకవర్గంలో గట్టిపట్టుంది. ఆ నియోజకవర్గంలో రాజన్నదళం తరఫునా అన్ని పంచాయితీలలో సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులను పోటీకి పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఆ మేరకు పోస్టర్లు కూడా ఏర్పాటు చేయించారు. మేకపాటి సోదరుల వల్ల పార్టీకి జరుగుతున్న నష్టం గురించి ఎంతగా చెప్పినా అధినాయకత్వం నుంచి కట్టడి చర్యలు లేకపోవడంతో పార్టీని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇదివరేక మేకపాటి కార్యకలాపాల తో విభేదించిన కాకాని గోవర్థన్‌రెడ్డి ఆశీస్సులు చిరంజీవిరెడ్డి వర్గానికి అందిస్తున్నట్లు సమాచారం. తాజా పరిణామంతో ఇతర నియోజకవర్గాల్లోనూ మేకపాటికి వ్యతిరేకంగా మరికొందరు నిరసన గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎల్.ఎం. మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజక వర్గానికి వైకాపాకు సమన్వయ కర్తగా చాలా కాలంగా పని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు పదవులు ఎరచూపినప్పటికీ తలొగ్గకుండా జగన్‌పై, వైఎస్‌పై వున్న అభిమానాన్ని చాటుకున్నారు. తొలి నుంచి వైకాపాకు అంకితభావంతో పనిచేస్తున్నారు. అందుకు గుర్తింపుగానే ఆయనకు ఇన్‌ఛార్జి పదవిని అప్పగించారు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇక రాబోయే ఎన్నికలకు తానే అభ్యర్థి అనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ కూడా గతంలో ఆ మేరకు హామీ ఇచ్చింది. అయితే ఇటీవల అనూహ్య రీతిలో మరొకరిని ఇన్‌ఛార్జిగా నియమించారు. ఆ నిర్ణయంతో ఖంగుతిన్న మోహన్ రెడ్డి పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం అక్కడ జరిగిన పార్టీ సమావే శంలో ఆయన నిరసన వ్యక్తం చేశారు. కొత్త సమన్వయ కర్త అనుయాయులకు, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి వర్గీయులకు మధ్య ముష్టియుద్ధం జరిగింది. పార్టీ నిర్ణయం తెలిసిన వెంటనే మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైకాపాలో నమ్ముకుని పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోయారు. డబ్బున్నవారికే పెద్దపీట వేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇకపోతే గుంటూరు జిల్లాలో అసమ్మతి నేతలు సమావేశ మయ్యారు. డబ్బున్నవారికి, పార్టీఫండ్ బాగా ఇచ్చిన వారికి ఇన్‌ఛార్జి పదవులు కట్టబెడుతూ పాతవారిని మారుస్తూ తీసుకున్న నిర్ణయాలతో పదవులు కోల్పోయిన వారంతా ఇందులో పాల్గొన్నారు. పార్టీ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. జగన్ జైలుకు వెళ్ళాక పార్టీలోని కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, పార్టీకి విధేయతలతో సంబంధం లేకుండా ఎవర్వు ఎక్కువగా డబ్బులు ముట్టజెబితే వారికి ఇన్‌ఛార్జి పదవులు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. త్వరలోనే జగన్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని వారు నిర్ణయానికి వచ్చారు. అంతేకాకుండా స్థానికేతరులను ఇన్‌ఛార్జిలుగా నియమించడం ఏమిటని ఆక్షేపిస్తున్నారు. స్థానికంగా కార్యకర్తలతో, ప్రజలతో సంబంధాలు వున్న నేతలు కాకుండా బయటి వారిని ఇన్‌ఛార్జిలుగా నియమిస్తే ప్రయోజనం ఏమిటని, ఎలా గెలుస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ఫండ్, పార్టీ ఫండ్ వస్తే చాలని అనుకుంటున్నారా, లేక ఎన్నికల్లో పార్టీ గట్టెక్కాలని భావిస్తున్నారా, ఎలాగో జగన్ బయటకు వచ్చేది లేదు, గెలిచే అవకాశాలు అంతకన్నా లేవనే ఉద్దేశ్యంతో ఇన్‌ఛార్జిల పోస్టులను అమ్ముకుంటున్నారా అని గుంటూరు జిల్లాకు చెందిన అసంతృప్తి నేతలు పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్టు తెలుస్తోంది.