June 29, 2013

బాధితుల అనుభవాలు మాటల్లో చెప్పలేం : చంద్రబాబు

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న బాధితుల అనుభవాలు మాటల్లో చెప్పాలేమని, చార్‌ధామ్‌లో యాత్రికులు నరకం అనుభవించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. బాధితులను ఆదుకునేందుకు ఉత్తరాఖండ్ వెళ్ళిన చంద్రబాబు వారిని పరామర్శించారు. వారు అనుభవించిన బాధలను తెలుసుకున్న ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చాలా భయంకరమైన అనుభవాలు ఎదురైనాయని అన్నారు. బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు..

ఉత్తరాఖండ్‌లో ఒక చోట బాధితులు తిండి నీళ్లు లేక, బాతకాలి కాబట్టి తాము కట్టుకున్న బట్టలతో శవాలు పడిఉన్న నీటిలో తడిపి ఆ నీటినే తాగామని తెలిపారని బాబు అన్నారు. మరో మహిళ తన కళ్లముందే తన కుమార్తె వరదలో కొట్టుకుపోయిందని వాపోయింది. ఆ చలిలో బిక్కుబిక్కుమంటూ ఉందని, కట్టుకోడానికి చీర లేక కేవలం లంగా, జాకెట్టుతో ఉందని, అక్కడ ఒక చోట మంట ఉంటే అటుగగాపోయిన గుర్రం ఆమెను తన్నడంతో మంట పక్కన పడిందని, కనీసం లేవలేని స్థితిలో ఉండగా అటుగా పోయినవాళ్ళు ఆమెను తీసి పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమె డెహ్రాడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నదని చంద్రబాబు తెలిపారు. ఆమె ఎవరో తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశామని చంద్రబాబు తెలిపారు.

మరో పద్మా అనే మహిలా తన కళ్లముందే కుటుంబ సభ్యులు ఐదుగురు వరదలో కొట్టుకుపోతుంటే ఒంటరిగా మిగిలిన ఆమె బాధ వర్ణనాతీతం అని, ఇలాంటి సంఘటనలు కోకొల్లలు జరిగాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ ఏపీ భవన్‌కు చేరుకున్న బాధితులకు అక్కడి అధికారులు సరైన సదుపాయాలు కల్పించలేదని, కనీసం స్నాన, భోజన వసతులు కూడా కల్పించలేదని చంద్రబాబు నాయుడు ఆదేదన వ్యక్తం చేశారు.

ఉత్తరాఖండ్‌లో తెలుగు బాధితుల పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని, సహాయం అందించడం లేదని తన దృష్టికి రావడంతో ఆ రాష్ట్ర సిఎం విజయ బహుగుణ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోయినా ఆయన ఇంటికి వెళ్లి అన్ని విషయాలు వివరించానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తర్వాత టీడీపీ నేతలు రమేష్ రాథోడ్, కొనకళ్ల డెహ్రాడూన్‌లో మకాం వేసి, ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి, బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టామని చంద్రబాబునాయుడు తెలిపారు.