June 29, 2013

టీడీపీ సహాయం ముమ్మరం

ఉత్తరాఖండ్ విలయంలో చిక్కుకుపోయిన తెలుగువారి కోసం చేపట్టిన సహాయ కార్యక్రమాల వేగం పెంచడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఉన్న తమ పార్టీ ఎంపీలు, వైద్య బృందాలతో శనివారం ఆయన నాలుగు గంటలకోసారి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్, కొనకళ్ల నారాయణరావు, నిమ్మల కిష్టప్ప ప్రస్తుతం ఢిల్లీ, డెహ్రాడూన్‌లలో ఉన్నారు. ఇంకా 150 మంది తెలుగువారి ఆచూకీ దొరకడం లేదని తెలియడంతో.. బదరీనాథ్, జోషీమఠ్ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు జరపాలని ఆయన వారిని కోరారు.

బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పాలని, వైద్య బృందం వారికి అవసరమైన వైద్యం, మందులు ఇవ్వాలని ఆయన కోరారు. అవసరమైతే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని నామా నాగేశ్వరరావును ఆదేశించారు. ఇక.. ఉత్తరాఖండ్ బాధితుల కోసం టీడీపీ, ఎన్టీఆర్ ట్రస్టు చేపట్టిన సహాయ కార్యక్రమాలకు మద్దతుగా శనివారం ఆశయ ఫౌండేషన్ తరపున వాసిరెడ్డి ప్రసాదరాజా రూ. 5 లక్షలు అందజేశారు. కూకట్‌పల్లికి చెందిన జాస్తి శ్రీధర్ తమ కుమార్తె అన్విత పేరు మీద రూ. 50 వేలు విరాళం అందచేశారు.

ఖానాపూర్ నియోజకవర్గ పార్టీ నేతలు, సభ్యులు రూ. 1.20 లక్షలు, ఏవీఎం రావు రూ. 50 వేలు, బుక్కా వేణుగోపాల్ రూ.50 వేలు, జి. శివ ప్రసాదరావు రూ.20 వేలు, రామినేని సంయుక్త రూ. 10 వేలు విరాళంగా ఇచ్చారు