June 29, 2013

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి పెద్దిరెడ్డి బుచ్చయ్యచౌదరి

స్థానిక సంస్థల ఎన్నికలు, మద్యం విధానంపై చర్చించేందుకు అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం సాయంత్రం తన నివాసంలో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని నిర్ణయించారు. 34 శాతానికి తక్కువగా కాకుండా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.మద్యం విధానంపై టీడీపీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. మద్యాన్ని కేవలం ఆదాయ వనరుగా చూస్తు, ప్రభుత్వం పేదవారి జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. చంద్రబాబుతో సమావేశమైన అనంతరం టీడీపీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బుచ్చయ్యచౌదరి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సత్వరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమాయాత్తం చేసేందుకు ఐదు చోట్ల ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్లను తగ్గించాలని చూస్తే చూస్తు ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే పర్మిట్‌ రూమ్‌లను, బెల్ట్‌షాపులను ఎత్తివేస్తుందని పేర్కొన్నారు.