June 29, 2013

ది లీడర్‌

ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న వారిని ఆదుకునేందుకు ఎలా చురుకుగా స్పందించాలో ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలకుల కళ్లు తెరిపించేలా ఆచరించి చూపించారు. ఛార్‌దామ్‌ యాత్రకు వెళ్లిన తెలుగు వారు ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో చిక్కుకున్నారు. తమను కాపాడి స్వస్థలాలకు తరలించేవారి కోసం వెయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి మొద్దునిద్రలో జోగుతుండడంతో, వరదల్లో చిక్కుకుని ఇబ్బందులెదుర్కొంటున్న యాత్రికులను సురక్షితంగా వారి స్వస్థలాలకు తరలించేందుకు చంద్రబాబు చూపిన చొరవ ప్రశంసనీయం. ప్రభుత్వం చేయలేని పనిని ప్రతిపక్షనేతగా చంద్రబాబు చేసి చూపించారు.

బాధితులను విమానాల్లో సొంత ఖర్చుతో హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాలకు తరలించారు. అప్పటి వరకు తాము ఎప్పుడూ ఇళ్లకు చేరుతామో తెలియని యాత్రికులు చంద్రబాబు చూపిన చొరవతో ఒక్కరోజులోనే డెహ్రాడూన్‌ నుండి ఢిల్లీకి చేరుకుని అక్కడి నుండి తమ సొంతూళ్లకు పయనమయ్యారు. విమానాశ్రయాల్లో దిగిన తరువాత వరద బాధిత యాత్రికులను స్వస్థలాలకు తరలించేందుకు పార్టీ నేతల ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయించి చంద్రబాబు తానే అసలు, సిసలైన పాలనాధ్యక్షుడినని మరోసారి నిరూపించుకున్నారు. ఛార్‌దామ్‌ యాత్రకు వెళ్లి వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలుగువారిని ఢిల్లీకి తరలించి అక్కడి నుండి ప్రత్యేక విమానంలో 167 మందిని నేరుగా హైదరాబాద్‌కు తరలించింది. ప్రభుత్వం చేయలేని పనిని పార్టీపరంగా చంద్రబాబు చేసి చూపించి అందరి మన్నలను పొందారు.

టీడీపీ నాయకత్వం 25వ తేదీన మరో 51 మందిని స్వస్థలాలకు తరలించగా, 26వ తేదీన డెహ్రాడూన్‌ నుండి 140 సీట్ల సామర్ధ్యం కలిగిన స్పెస్‌జెట్‌ విమానాన్ని యాత్రికుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసి ప్రభుత్వం విఫలమైన ప్రతి చోటా తామున్నమని యాత్రికులకు భరోసాను కల్పించింది. ఛార్‌దామ్‌ యాత్రకు వెళ్లిన వారు భారీ వరదల్లో చిక్కుకున్న తెలిసిన తరువాత మూడు రోజులకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం కంటితుడుపు చర్యలతో సరిపెట్టుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లినా చంద్రబాబు ఆదివారం ఉదయమే నగరానికి చేరుకుని, అదే రోజు సాయంత్రం హుటా, హుటీనా తెలుగు యాత్రికులను పరామర్శించేందుకు ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో యాత్రికుల కల్పిస్తున్న సౌకర్యాలను చూసి చంద్రబాబు చలించిపోయారు. యాత్రికులకు మైరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ పార్టీ ఎంపీలతో కలిసి ఏపీ భవన్‌ ముందు ధర్నాకు దిగారు.

బాధితులకు కల్పిస్తున్న అరకొర సౌకర్యాలపై ఏపీ భవన్‌ రెసిడెంట్‌ అధికారి శశాంక్‌ గోయల్‌, చంద్రబాబు ఆగ్రహానికి గురికావాల్సివచ్చింది. మైరుగైన సౌకర్యాల కల్పిస్తామని పేర్కొనడంతో బాబు ధర్నా విరమించారు. యాత్రికులను పరామర్శించి వారికీ ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ నుండి నేరుగా డెహ్రాడూన్‌కు వెళ్లి అక్కడి యాత్రికులను పరామర్శించారు. వారు చెప్పిన బాధలు విని చలించిపోయిన చంద్రబాబు ఎంపీలు రమేష్‌ రాథోడ్‌, కొనకళ్ల నారాయణలను అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. నేరుగా ఉత్తరాఖండ్‌ సీఎం విజయ్‌ బహుగుణను కలిసి తెలుగువారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రుషికేష్‌, బద్రీనాథ్‌, హర్షలీ ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఆర్మీ క్యాంపుల్లో తలదాచుకున్న తెలుగువారిని ఒక్కచోటకు చేర్చి వారికీ భోజన, వసతి, వైద్య సౌకర్యాలు కల్పించి ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు తరలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఎంపీలు కృషి చేశారు.

వరదల్లో అన్ని కోల్పోయిన యాత్రికులను ఆదుకునేందుకు చంద్రబాబు ఒక్కొరికీ పది వేల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. మొత్తం 12 లక్షల రూపాయలను వరద బాధితులకు అందజేసి ప్రభుత్వ సహాయాన్ని వెనక్కి నెట్టారు. ప్రభుత్వ పక్షాన కేవలం రెండు వేల రూపాయల ఆర్ధిక సహాయమందజేయగా, టీడీపీ నాయకత్వం ఐదింతల అధిక సహాయమందజేసి యాత్రికుల మెప్పును పొందింది. దీనితో ప్రభుత్వం మెల్కోని నష్ట నివారణ చర్యల్లో భాగంగా బాధితులకు ఐదేసీ వేల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించింది. టీడీపీ విస్త్రృతస్థాయిలో చేపట్టిన సహాయక చర్యలు ఆ పార్టీ భవిష్యత్తులో రాజకీయంగా ఎంతో మేలు చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు 218 రోజులు చేపట్టిన ‘వస్తున్నా...మీకోసం’ పాదయాత్ర ద్వారా కంటే ఛార్‌దామ్‌ యాత్రికులకు చేసిన సహాయక చర్యల ద్వారానే ఎక్కువ ప్రాచూర్యం లభించిందంటున్నారు.