June 29, 2013

రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీని ఎలా దెబ్బతీయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తుంది.

రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీని ఎలా దెబ్బతీయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ర్టంలో ప్రత్యేక తెలంగాణ సమైఖ్యాంధ్ర ఉద్యమాలు బలంగా నడుస్తున్న క్రమంలో రెండు ప్రాంతాల్లో టీడీపీని దెబ్బతీయాలంటే ఏ వ్యూహంతో ముందుకు వెళ్ళాలన్న ప్రణాళికతో కాంగ్రెస్ తర్జన భర్జన పడుతుంది. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. కాగా, ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలలో తెలంగాణలో టీఆర్‌ఎస్, సీమాంధ్రలో వైకాపాలు బలపడ్డాయన్న ప్రచారం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీని పూర్తిగా దెబ్బతీయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ వ్యూహాలకు పదునుపెట్టినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు స్వతహాగా కరుడుగట్టిన సమైక్యవాదిగా ముద్రపడ్డ వ్యక్తి. అయితే ఆ పార్టీ ప్రత్యేక తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని కేంద్రం తెలంగాణ ఏర్పాటు విషయంలో తీసుకునే ఏ చర్యకు తాము అడ్డుకోబోమని పార్లమెంట్‌లో బిల్లుపెట్టే మద్ధతిస్తామని ప్రకటించడంతో తెలంగాణలో టీడీపీ పట్ల కొంత సానుకూల ధోరణి ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలా..లేక సమైక్యంగా ఉంచాలా అన్న అంశాల్లో ఆచితూచి అడుగు వేసేందుకు తర్జన భర్జన పడుతుంది. రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రత్యేక తెలంగాణ అంశాన్ని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ర్టంలో ప్రాంతీయ పార్టీలుగా ఉన్న టీడీపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌లు కాంగ్రెస్‌తో సమానంగా రాజకీయంగా పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌పార్టీ, టీఆర్‌ఎస్ రెండు కూడా తెలుగుదేశం పార్టీతో బద్ధ వైరుధ్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌తోకూడా అంతే దూరం ఉన్నా.. టీఆర్‌ఎస్ ఇప్పటికే అనేక సందర్భాలలో ప్రత్యేక తెలంగాణ ఇస్తే.. తమ పార్టీ కాంగ్రెస్‌లో వీలినం చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇకపోతే వైసీపీ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగానే టీడీపీ ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం దివంగత నేత రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ ఏర్పాటు చేసిన ఈ పార్టీకి కేంద్రంలో కాంగ్రెస్‌లోని అనేక మంది పెద్ద నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, వైకాపాలు సీట్లు సంపాదించినా కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీలను తమకు అనుకూలంగా మలుచుకోవడం పెద్ద కష్టం కాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం టీడీపీని ప్రధాన శత్రువుగా కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే రాబోయే ఎన్నికలలో టీడీపీనే టార్గెట్‌గా చేసి ఎన్నికల వ్యూహానికి పదునుపెడుతున్నట్లు సమాచారం. తెలుగు దేశం పార్టీ రెండు ప్రాంతాలలో దెబ్బతినేలా ఏ రకమైన వ్యూహంతో ముందుకు పోతే బాగుంటుందో కాంగ్రెస్ కోర్ కమిటీ భావిస్తుంది. అటు సీమాంధ్రలో వైకాపా, తెలంగాణలో టీఆర్‌ఎస్ బలంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ రెండు పార్టీలను కాంగ్రెస్‌కు రాజకీయంగా పెద్దగా ఇబ్బంది ఉండదని అందువల్ల ఆ పార్టీ గెలిచినా భవిష్యత్‌లో కాంగ్రెస్‌తోనే జతకట్టే అవకాశాలున్నా యని అందువల్ల టార్గెట్ టీడీపీగా కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగడలతో ముందుకు పోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.