June 29, 2013

విహెచ్‌కు వృద్ధాప్యం పైబడినా దాదాగిరీ తగ్గలేదు: వెంకటేశ్వర్లు

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావుకు వృద్దాప్యం పైనబడినా దాదాగిరీ తగ్గలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 'ఏదో ఒకటి తగాదా పెట్టుకొని వివాదంలోకి చంద్రబాబును కూడా లాగాలన్న తాపత్రయం విహె చర్యల్లో స్పష్టంగా కనిపించింది. ముందు రోజు ఢిల్లీలోని ఎపి భవన్లో చంద్రబాబును పొగిడాడు. తమ పార్టీవాళ్ళు తిట్టేసరికి డెహ్రాడూన్ విమానాశ్రయంలో చంద్రబాబుతో తగాదా పెట్టుకోవాలని చూశాడు. ఆయన మూడుసార్లు రాజ్యసభ సభ్యునిగా చేశాడు. వయసు పైబడింది. ఓపిక లేకపోయినా దాదాగిరీ చేయాలని తాపత్రయపడుతున్నాడు' అని బోడకుంట్ల విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ పంపిన వైద్య బృందాన్ని ఎపి భవన్ నుంచి రెసిడెంట్ కమిషనర్ బయటకు పంపడం తప్పేనని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారని, కాని ఆయనపై చర్యలు మాత్రం ఏవీ తీసుకోవడం లేదని వెంకటేశ్వర్లు అన్నారు. మొత్తం సహాయ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాత్రే కనిపించలేదని, ఏదో కంటి తుడుపుగా బాధితులను పరామర్శించి వచ్చారు తప్ప సహాయ కార్యక్రమాలను పట్టించుకొన్న దాఖలాలు ఏవీ లేవని ఆయన అన్నారు.