June 29, 2013

బాబు వచ్చే వరకు మీ బుద్ధి ఏమైంది?

ఛార్‌దామ్‌ యాత్రికులను ఆదుకోవాలన్న ఆలోచన తొలుత కాంగ్రెస్‌ నేతలకు లేదని, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించిన తరువాతే వారు మొద్దునిద్ర వీడి హడావుడి చేశారని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయ సమన్వయ కార్యదర్శి టీడీ జనార్దనరావు అన్నారు. చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. అమెరికా పర్యటన ముగించుకుని నగరానికి చేరుకున్న చంద్రబాబు అదే రోజు హుటా, హుటీనా ఢిల్లీకి వెళ్లి బాధితులను పరామర్శించే వరకూ కాంగ్రెస్‌ నేతలు ఏమీ పట్టనట్లు వ్యవహరించారని గుర్తు చేశారు. ఢిల్లీ నుండి నేరుగా డెహ్రాడూన్‌కు వెళ్లి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి విజయ్‌బహుగుణను కలిసి తెలుగు యాత్రికులను కాపాడాలని కోరారన్నారు.

సహాయక చర్యలు జరుగుతున్న తీరును ఆయన్ని అడిగి తెలుసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. తెలుగు యాత్రికుల తరలింపులో జరుగుతున్న వివక్షను విజయ్‌ బహుగుణ దృష్టికి తీసుకువెళ్లి, తెలుగువారిని వీలైనంత త్వరగా స్వస్థలాలకు తరలించేందుకు చొరవ చూపించాలని కోరడం జరిగిందన్నారు. ఆర్మీ క్యాంపులలో ఉన్న తెలుగు వారిని ఒక చోటకు చేర్చి వారికీ భోజన, వైద్య, వసతి సౌకర్యాన్ని కల్పించేందుకు చంద్రబాబు అన్ని చర్యలు తీసుకున్నారని టీడీ జనార్దనరావు తెలిపారు.

మూడు రోజుల పాటు డెహ్రాడూన్‌, రుషికేష్‌లో టీడీపీ ఎంపీలు మకాం వేసి బాధితుల యోగ, క్షేమాలు తెలుసుకుని వారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు కృషి చేసిన వారితో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ఘర్షణకు దిగడం దారుణమన్నారు. సోనియా మెప్పు కోసమే వీధి పోరాటానికి సిద్ధపడ్డారని విరుచుపడ్డారు. చంద్రబాబు దగ్గరుండి బాధితులను తరలిస్తున్నారని పేర్కొన్న నోటితోనే టీడీపీ నేతలను విమర్శించడం వీహెచ్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులను ఆదుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి సేవా కార్యక్రమాలు కొనసాగించారన్నారు.