May 25, 2013

ఐఏఎస్‌లా? దొంగలా? : పయ్యావుల

  'ఐఏఎస్‌లా?, దొంగలా?... పల్లెలో విద్యుత్ సమస్యల గురించి మాట్లాడదామని వస్తే దొడ్డి దారిన పారిపోతారా?' అంటూ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సీపీడీసీఎల్ అధికారులపై ఫైర్ అయ్యారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా సరిగా లేదని పయ్యావుల రెండు నెలల కిందట విద్యుత్ ఈఆర్‌సీ కార్యాలయానికి వెళ్లి బైఠాయించారు. అప్పట్లో ఈఆర్‌సీ స్పందించి ఇక నుంచి గ్రామాల్లో 5 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని సర్క్యులర్ విడుదల చేసింది. ప్రభుత్వం ఆదేశాలు గ్రామాల్లో అమలు కావడం లేదని, ఈ విషయం అధికారుల దష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఆయన శనివారం సీపీడీసీఎల్ కార్యాలయానికి వెళ్లారు. ఇంధనశాఖ కార్యదర్శి ఎం సాహు, సీపీడీసీఎల్ సీఎండీ అనీల్‌కుమార్ సమావేశంలో ఉన్నారని అటెండర్ చెప్పడంతో కేశవ్ వారి కోసం కొంత సేపు వేచి చూశారు.

కొద్ది సేపటి తర్వాత అధికారులు సమావేశం ముగించుకుని వెళ్లిపోవడంతో, అటెండర్ వచ్చి అధికారులు అందరూ వెళ్లిపోయారని అనడంతో కేశవ్ ఫైర్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న ఐఏఎస్‌లు ప్రజా ప్రతినిధులొస్తే దొంగల్లా పారిపోతారా? అని ప్రశ్నించారు. తనకు జరిగిన అన్యాయంపై సభాపతికి ఫిర్యాదు చేస్తానన్నారు.

ఛార్జీలు పెంచమని ప్రభుత్వం ఆదేశాలిస్తే అమలు చేసే ఈ అధికారులు ఐదు గంటలు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని ఇచ్చిన సర్క్యులర్‌ను ఎందుకు అమలు చేయరని నిలదీశారు. రెండు రోజుల్లోగా ఆ సర్క్యులర్ అమలు చేయకపోతే ప్రజల నుంచి మిస్‌డ్ కాల్స్ రూపంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఆ ఇద్దరు అధికారులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు.