May 25, 2013

మందులోకి పనికొస్తుంది!: రేవంత్


ఓట్లు మాకు వేసి ఉచ్చ నీకు పోస్తారు..
దానిని పట్టుకుని ఉంచుకో
టీ టీడీపీ నేతలు పోస్తే ఊపిరాడక చస్తావు
కేసీఆర్ తిట్ల పురాణానికి దీటుగా రేవంత్ జవాబు
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల నిరసన

 
తెలంగాణలో చంద్రబాబుకు ఓట్లు కాదు కదా ఉచ్చ కూడా పడదంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యపై తెలుగుదేశం పార్టీ నేతలు అదే మోతాదులో ప్రతిస్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరులోని గాంధీబొమ్మ వద్ద టీడీపీ నాయకులు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. "ఓట్లు మాకు వేసి ఉచ్చ నీకు పోస్తారు. దానిని పట్టుకొని ఉంచుకొంటే ఫాం హౌస్‌లో మందు కొట్టేటప్పుడు ఎప్పుడైనా సోడా తక్కువైతే కలుపుకోవడానికి పనికొస్తుంది. లేకపోతే ఫాం హౌస్‌లో మొక్కలకు ఎరువుగా వాడు. అవైనా బాగా పెరుగుతాయి'' అని కేసీఆర్‌ను ఉద్దేశించి టీడీపీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎర్రబెల్లి గురించి కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అదే ఎర్రబెల్లి నాయకత్వంలో తెలంగాణలోని టీడీపీ కార్యకర్తలంతా కలిసి కేసీఆర్ మాట్లాడుతున్న దానిని పోస్తే ఆయన, ఆ పార్టీ నేతలు అందులో కొట్టుకుపోయి ఊపిరాడక చస్తారని కూడా రేవంత్ వ్యాఖ్యానించారు. "మేం కూడా కేసీఆర్‌లాగా మాట్లాడగలం. మాకు అంత కంటే ఎక్కువే వచ్చు. కానీ, సభ్యత అడ్డం వచ్చి మాట్లాడలేకపోతున్నాం. కేసీఆర్ మాటలు చూసి తెలంగాణలో అందరూ ఇలాగే మాట్లాడతారని ఇతర ప్రాంతాల వారు అనుకొనే ప్రమాదం ఉంది.

ఈ మాటలకు.. ఈ సంస్కృతికి తెలంగాణకు సంబంధం లేదు. బుడ్డిపేట నుంచి వలస వచ్చిన కేసీఆర్ తనతోపాటు ఈ అవలక్షణాలను మోసుకొని వచ్చాడు. తెలంగాణ సమాజానికి, సంస్కృతికి మీ అవలక్షణాలను పులమకండి. అవి తెలంగాణ మాటలు కావు'' అని విమర్శించారు. ఎండ దెబ్బకు కేసీఆర్‌కు మతి భ్రమించిందని, అందుకే నోటికి వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణపై మహానాడులో టీడీపీ తీర్మానం చేస్తుందా అని ప్రశ్నిస్తున్న కేసీఆర్.. అదే ప్రశ్నను కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. "మొన్ననే కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడితోపాటు అన్ని జిల్లాల నేతలు పాల్గొన్నారు. ఈ సదస్సులో తెలంగాణపై తీర్మానం చేయాలని కేసీఆర్ ఎందుకు అడగలేదు? ఒక్క టీడీపీనే ఎందుకు అడుగుతున్నావు? కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని అడగడమేమిటి' అని నిలదీశారు. తె లంగాణ రాష్ట్ర సాధన కోసం వెయ్యి మంది తమ ప్రాణాలు అర్పిస్తే వాటిని వంద అసెంబ్లీ సీట్ల కోసం వాడుకోవడానికి కేసీఆర్ తపిస్తున్నారని విమర్శించారు.

"నీ బొంద మీద వంద అసెంబ్లీ సీట్లు పెట్టినా వాటిని చివరకు సోనియా గాంధీకి అమ్ముకొనే వాడివే. రఘునందన్, చాడా సురేష్ రెడ్డి, రుమాండ్ల రామచంద్రయ్య వంటి వారంతా నీ అసలు రంగు బయట పెడుతున్నారు. ఉస్మానియా జేఏసీలో పని చేసిన విద్యార్థి నేతలకు నీ రంగు తెలిసిపోయి టీడీపీలోకి వస్తుంటే చెమటలు పడుతున్నాయి. టీఆర్ఎస్‌కు వంద సీట్లు వచ్చినా ఒరిగేది శూన్యం. ప్రజలను వంచించి 4 సీట్లు గెలిపించుకోవడానికే కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు'' అని రేవంత్ మండిపడ్డారు. కాగా, కేసీఆర్ భాష మార్చుకోవాలని, లేకపోతే జనం ఉచ్చ చేతుల్లో కాదు.. నోట్లో పోస్తరని వరంగల్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు బస్వారెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ వెంటనే చంద్రబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బాన్సువాడ టీడీపీ ఇన్‌చార్జీ బద్యానాయక్ డిమాండ్ చేశారు.

కేసీఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే మల మూత్రాలతో ఆయన నోటిని శుభ్రం చేస్తామని నెల్లూరు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి మండిపడ్డారు.కేసీఆర్ వెయ్యి మందిని బలి తీసుకుని వేలాది కోట్లను దోచుకున్నారని ఎంపీ నామా విమర్శించారు. చంద్రబాబు పేరు తలిస్తేనే కేసీఆర్‌కు ఉచ్చ పడుతుందని దయాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేకే మతిభ్రమించినట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యేలు సీతక్క, సత్యవతి రాథోడ్ అన్నారు. పార్టీ అధినేతలా కాకుండా, వెగటు భాషా సంఘం అధ్యక్షుడిలా కేసీఆర్ దిగజారుడు పదజాలం వాడుతున్నారని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మండిపడ్డారు.