May 25, 2013

టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన క్యాడర్ : చంద్రబాబు

హైదరాబాద్ : టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన క్యాడర్ ఉందని టీడీపీ అ«ధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్నారని, లోకేష్ సహా యువతను పార్టీలోకి ఆహ్వానిస్తామని బాబు తెలిపారు. వచ్చే ఎన్నికలకు ముందుగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వెల్లడించారు. కడియం శ్రీహరిని విశ్వాసం లేని నేతగా దూషించారు. ఆనాడు తెలంగాణపై ఇచ్చిన లేఖ బ్రహ్మాండంగా ఉందన్న కడియం, ఇప్పుడు రాజకీయాల కోసం మాట్లాడుతున్నారని ఆరోపించారు.

2009లో తామచ్చిన లేఖ ఆధరంగానే టీఆర్ఎస్ తమతో పొత్తు పెట్టుకుందని గుర్తుచేశారు. ఆ లేఖకు కట్టుబడి ఉన్నామంటే తప్పుపడతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులను కూడా పెట్టలేని వారు 100 సీట్లు ఎలా గెలుస్తారని బాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రం పిల్ల కాంగ్రెస్ నేతల వల్లే భ్రష్టుపట్టిందని ఆరోపించారు. మ్యాచ్‌ఫిక్సింగ్ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో థర్డ్ ఫ్రంట్‌కు అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయన్నారు.

కమ్యూనిష్టులతో పొత్తులకు టీడీపీ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ప్రభుత్వంపై పోరాడటానికి అవిశ్వామే పరిష్కారమైతే కచ్చితంగా పెడతామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చాక అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని బాబు హామీ ఇచ్చారు. తనను, టీడీపీని దెబ్బతీయడానికే పురంధేశ్వరి విగ్రహ ప్రతిష్టను వివాదాస్పదం చేశారని దుయ్యబట్టారు.

ఎన్టీఆర్‌పై గౌరవంతోనే విగ్రహం విషయంలో వెనక్కి తగ్గామన్నారు. ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు తొలగించిన పుడు పురంధేశ్వరి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు హాజరుకావాలని, పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అందరూ కలిసి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.