May 25, 2013

దమ్ముంటే.. చర్చకు రండి!: చంద్రబాబు


తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారో తేల్చుకుందాం
తొడగొట్టిన చంద్రబాబు.. కేసీఆర్‌కు సవాల్


హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తొడగొట్టారు. తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారో తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. "కేసీఆర్.. నువ్వూ కేంద్రంలో, రాష్ట్రంలో రెండు, మూడేళ్లు అధికారంలో ఉన్నావు. తెలంగాణ కోసం ఏం చేశావు? ఒక్క సమస్యనైనా పట్టించుకున్నావా? నువ్వేం చేశావో.. నేనేం చేశానో చర్చిద్దాం...రా'' అని చంద్రబాబు సవాల్ విసిరారు. సోమవారం నుంచి మహానాడు సదస్సు మొదలవుతున్న సందర్భంగా శనివారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వాటి ముఖ్యాంశాలు ఇవీ..

ఈసారి ఎన్నికల్లో పొత్తులు ఉంటాయా? ఉంటే ఎవరితో?
ఇంకా ఏమీ అనుకోలేదు. ముందు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాం. ఉంటే వామపక్షాలతోనే పొత్తుకు అవకాశం ఉంది. బీజేపీతో పొత్తుకు అవకాశం లేదు.

బీజేపీతో పొత్తు పెట్టుకొంటే పట్టణ ప్రాంతాల్లో మోడీపై ఉన్న సానుకూలత మీకు ఉపయోగపడుతుంది కదా?

పట్టణాల్లో ఆ సానుకూలత మాపై ఇంకా ఎక్కువ ఉంది. నేను అమలు చేసిన అభివృద్ధి నమూనానే గుజరాత్‌లో అమలు చేశారు.

రాష్ట్రంలో ఈసారి మీ పార్టీ పరిస్ధితి ఎలా ఉంటుంది?
నూటికి నూరు శాతం గెలుస్తాం. సొంతబలంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. జగన్ పార్టీ రోజురోజుకూ క్షీణిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కూడా బలహీనపడుతోంది. కాంగ్రెస్ పరిస్థితి అధ్వానం. హైదరాబాద్‌లో కార్పొరేటర్లను పోటీకి పెట్టలేని పార్టీ వంద సీట్లు వస్తాయని చెప్పుకొంటే ప్రజలు నమ్ముతారనుకోను.

వలసలు మీ పార్టీని బలహీనపర్చడం లేదా?

కేడర్ పటిష్ఠంగా ఉంది. ఎంతమంది వెళ్లినా మాకేం కాదు. వెళ్లినవారే నష్టపోయారు. ఇంటికి కష్టంవస్తే వదిలిపోతామా?కానీ వీళ్లు పిరికితనంతోనో.. ప్రలోభాలతోనే వెళ్లిపోయారు.

మీ చుట్టూ కోటరీ ఉందని వెళ్లిన నాయకులు అంటున్నారు.
పార్టీలో ఉన్నప్పుడు ఆ కోటరీలో వీళ్లు లేరా? ఇంటి దగ్గరా.. పార్టీ కార్యాలయంలో.. బయటా ప్రతిచోటా వీళ్లే ఉండేవారు కదా? ఎమ్మెల్యే సీట్లు వీళ్లకే కావాలి. ఇవ్వకపోతే నేను దుర్మార్గుడిని.

తెలంగాణపై మీకు స్పష్టత లేదని కడియం అంటున్నారు.
ఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి పార్టీ తరపున వెళ్లి లేఖ ఇచ్చి పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని మీడియాతో ఆయనే చెప్పారు.

మహానాడులో తెలంగాణపై తీర్మానం చేస్తారా?

టీఆర్ఎస్ అడిగితే చేయాలా? తీర్మానం చేసినా మరొకటి కావాలంటారు. ప్రజల కోణ ంలో ఏం చేయాలో అది చేస్తాం. మాకన్ని విషయాలపైనా స్పష్టత ఉంది. అవసరం అనుకొంటే మహానాడులో చర్చించాలా అన్నది ఆలోచిస్తాం.

ఉద్యమంలో ఆత్మహత్య చేసుకొన్న వారి కుటుంబాలను ఆదుకొంటారా?
మేం అధికారంలోకి వస్తే.. ప్రాంతంతో సంబంధం లేకుండా ఉద్యమంలో ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలను ఆదుకొంటాం. వారికి ఉద్యోగాలు ఇవ్వాలా లేక మరో రకంగా ఆదుకోవాలా అన్నది చూస్తాం.

రుణ మాఫీ ఎలా సాధ్యమని ముఖ్యమంత్రి అడుగుతున్నారు.

ఆయనకు నేనెందుకు చెప్పాలి? చేసి చూపిస్తా. నేను తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేశా. ఏది ఎలా సాధ్యమో.. ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. కిరణ్‌కు ఉన్నది కేవలం రెండేళ్ల అనుభవం. నేను చేసిన వాటిని కొనసాగించడమే వారికి చేతకావడం లేదు. వారికి నేను చెప్పేదేమిటి?

అవిశ్వాసం విషయంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని మీ ప్రత్యర్థులు అంటున్నారు.
అంత ఖర్మ నాకేమిటి? నాకేమైనా బెయిల్ కావాలా? కేసులు ఎత్తివేయించుకోవాలా? తోక పార్టీలు అవిశ్వాసం పెడితే మేం ఎందుకు మద్దతు ఇవ్వాలి? అవిశ్వాసం పెట్టి వాళ్లు బేరసారాలు చేసుకొంటుంటే మేం మద్దతు ఇవ్వాలా? రికార్డుల ప్రకారం ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చాలినంత మద్దతు ప్రతిపక్షాలకు లేదు. ప్రజల కోణంలో అవసరమైనప్పుడు అవిశ్వాసం సహా అన్ని అస్త్రాలను మేమే ప్రయోగిస్తాం.

ఎన్టీఆర్ కుటుంబానికి, పార్టీకి మధ్య అగాధం మాటేమిటి?
పార్టీ సుప్రీం. పార్టీ ప్రయోజనాల కోసం కుటుంబ సభ్యులు పని చేస్తే వారి గౌరవం పెరుగుతుంది. ఈ దిశగా కలిసి వచ్చే వారికి వెల్‌కం. పార్టీకి పునర్‌వైభవ సాధనకు వారందరి సహకారాన్ని కోరుతున్నాను. వైసీపీ ఫ్లెక్సీలపై ఎన్టీఆర్ బొమ్మ పెట్టడం తగదన్నది పార్టీ అభిప్రాయం. ఎవరైనా పెట్టుకోవచ్చునన్నది హరికృష్ణ వ్యక్తిగత అభిప్రాయం. పార్టీలో ఉన్నవారంతా పార్టీ అభిప్రాయాలకు కట్టుబడి ఉంటే బాగుంటుంది. టీడీపీ ఫ్లెక్సీలపై వైఎస్, ఇందిర ఫొటోలను మేం పెట్టడం లే దు. వైసీపీ నేతలను పెట్టవద్దని చెప్పాం. ఐనా సిగ్గు లేకుండా పెట్టుకొంటే వారి ఖర్మ.

లోకేశ్, ఎన్టీఆర్‌ల భవిష్యత్తు ఏమిటి?
పార్టీ కోసం పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉం టుంది. పార్టీ కోసం పని చేస్తే గౌరవం ఇస్తాం. కలుపుకొనిపోతాం. లోకేశ్ అయినా అంతే. నేను నా కొడుకుగా ప్రోత్సహించడం లేదు. పనిచేస్తే బాధ్యతలు వస్తాయి. రాజకీయం వారసత్వంగా రాదు. ఆసక్తి ఉండాలి.

టికెట్లు ముందుగా ప్రకటిస్తారా?
తగిన సమయంలో ప్రకటిస్తాం. ముందు ప్రకటించే ఆలోచన ఉంది. ఇన్‌చార్జులందరికీ టికెట్లు ఇస్తాం. ఎవరైనా బాగా పనిచేయకపోతే మాత్రం మారుస్తాం.