May 25, 2013

కేంద్రంలో తృతీయ ఫ్రంట్, ప్రత్యామ్నాయం లేదు: బాబు


హైదరాబాద్: కేంద్రంలో తృతీయ ఫ్రంట్ మాత్రమే ప్రత్యామ్నాయమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఎన్డియే గానీ యుపిఎ గానీ పెరగడ లేదని, ప్రాంతీయ పార్టీలు పెరుగుతున్నాయని, ఈ స్థితిలో కేంద్రంలో తృతీయ ఫ్రంట్ బలంగా ముందుకు వస్తుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని ఆయన అన్నారు. కేంద్రంలో మూడు సార్లు కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడడానికి తమ పార్టీయే కారణమని ఆయన అన్నారు. నాలుగో కూటమి అనే మాట లేదని ఆయన అన్నారు.

ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం చారిత్రిక అవసరమని ఆయన అన్నారు. తమ పార్టీకి క్రమశిక్షణతో పనిచేస్తే కార్యకర్తల బలగం దండిగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ప్రాంతీయ పార్టీగా ఉండి కూడా తమ పార్టీ ఉనికిని చాటుకుందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ పాలనలో ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలు, కేంద్రం అనుసరించాయని ఆయన చెప్పారు. 2009లో తాము ప్రకటించిన నగదు బదిలీ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.

ఎన్ని ఇబ్బందులు వచ్చినా తమ పార్టీని కార్యకర్తలే కాపాడుతున్నాయని ఆయన అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. దేశంలో ఏ అభివృద్ధి జరిగినా తమ పార్టీ ముద్ర ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం తెలుగువారి ప్రతిష్ట మంట కలిసిందని ఆయన వ్యాఖ్యానించారు. మహిళలకు భద్రత, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కల్పించామని చెప్పారు.

తాము రాష్ట్రంలో నీతివంతమైన, సమర్థవంతమైన పాలన అందించామని చెప్పారు. ప్రస్తుత స్థితిలో త్వరలో జరుగుతున్న మహానాడుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ఆయన చెప్పారు. తాము గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నామని, ఇప్పుడు వామపక్షాలు ముందుకు వస్తే పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో పొత్తుల గురించి మాట్లాడుతామని వామపక్షాలు అంటున్నాయని, అందువల్ల తాము తొందరపడ దలుచుకోలేదని, తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలసు సాగిస్తున్నామని ఆయన చెప్పారు.

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే ఆలోచన చేస్తామని ఆయన చెప్పారు. తోక పార్టీలు అవిశ్వాసం పెడితే తాము వాటి వెంట వెళ్లబోమని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ లేఖను చూసిన తర్వాతనే తెరాస 2009లో తమతో పొత్తు పెట్టుకుందని ఆయన చెప్పారు. హైదరాబాదులో పోటీ చేయలేని తెరాస వంద సీట్లు ఎలా గెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్‌పై గౌరవంతో పార్లమెంటులో విగ్రహావిష్కరణపై సర్దుకుపోయామని ఆయన చెప్పారు. పుశువులకు ఉన్న కృతజ్ఢత కూడా జంప్ జిలానీలకు లేదని, తమ ఇళ్లలో కష్టాలు ఉంటే గోడ దూకేస్తారా అని ఆయన అన్నారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని, 2014లో సీట్లపై, పొత్తులపై తమకు స్పష్టత ఉందని ఆయన చెప్పారు. తెలంగాణపై గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని, తెరాస విమర్సలను తమ పార్టీ నేతలు రాజకీయ కోణంలో చూడాలని ఆయన అన్నారు.