May 25, 2013

రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ఔట్!: చంద్రబాబు

ఇప్పుడు కొన్ని జిల్లాల్లోనే భవిష్యత్తులో అక్కడ కూడా ఉండదు
ఎన్నికలు, సీట్లు, వసూళ్లే వాళ్ల పని
ఒక్క జిల్లాలోనూ దళితుడిని పార్టీ అధ్యక్షుడిని చేయలేదు
కేసీఆర్ కుటుంబంపై బాబు ధ్వజం
టీడీపీలో చేరిన ఓయూ విద్యార్థి నేత
రాజారాంకు టికెట్.. పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవి: బాబు
దొరల గడీ కంటే బీసీల పార్టీయే బెటర్: రాజారాం

'మీరు ఒకటంటే మేం వంద అంటాం. ఖబడ్దార్' అంటూ కేసీఆర్‌ను చంద్రబాబు హెచ్చరించారు. పార్టీలను తిట్టవచ్చని, సిద్ధాంతాలను విమర్శించవచ్చని, కానీ, వ్యక్తిగత విమర్శలు మంచిది కాదని హితవు పలికారు. 'మాయ మాటలు, రోజుకో అబద్దం.. ఇవే కేసీఆర్ పని. ఉప ఎన్నికలు వేరే.. సాధారణ ఎన్నికలు వేరే.. టీఆర్ఎస్ కొన్ని జిల్లాల్లోనే ఉంది. రానున్న రోజుల్లో అక్కడ కూడా ఉండదు. మీరే చూస్తారు' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఉస్మానియా వర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకుడు రాజారాం యాదవ్ శనివారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌భవన్‌లో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు. టీఆర్ఎస్, కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'తెలంగాణకు అనుకూలంగా 2005లోనే టీడీపీ తన వైఖరిని స్పష్టం చేసింది. దీంతో, టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీకి 45 సీట్లు ఇస్తే పది కూడా గెలవలేకపోయారు.

తెలంగాణపై టీడీపీ ఇప్పటికీ స్పష్టంగానే ఉంది. 2008 నాటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెబుతూ లేఖ కూడా ఇచ్చాం. అయినా టీఆర్ఎస్ విమర్శిస్తోంది. వాళ్లకు ఎప్పుడూ ఎన్నికలు, సీట్లు, నోట్లు, వసూళ్ల గొడవలు తప్ప మరేమీ పట్టదు. 27 ఏళ్ల రాజకీయ జీవితం, 12 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో కేసీఆర్ గానీ, ఆ పార్టీ నేతలు కానీ ప్రజలకు ఏం చేశారు?' అని నిలదీశారు. బాబ్లీపై తామే పోరాడామని, వర్గీకరణపై తామే ఉద్యమం చేశామని చెప్పారు. ఉద్యమం ముసుగులో టీఆర్ఎస్ నేతలు డబ్బు దండుకున్నారని, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. 'వంద సీట్లు ఎక్కడ గెలుస్తారు? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ పదవికి కూడా పోటీ చేయలేదు. సెంటిమెంటుతో రాజకీయాలు చేయాలనుకుంటున్నారు.

దళితుడిని సీఎం చేస్తానన్నాడు. ఒక్క జిల్లాలో కూడా దళితుడిని పార్టీ అధ్యక్షునిగా చేయలేదు. మరి ఎస్సీని సీఎంగా ఎలా చేస్తారు?' అని నిలదీస్తారు. 2014లో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమన్నారు. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేసిన, బడుగులకు సామాజిక న్యాయం జరగాలని పోరాడుతున్న రాజారాం యాదవ్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తనపై 180 కేసులున్నా, జైల్లో 105 రోజులు గడిపినా రాజారాం వెరవకుండా పోరాడారని ప్రశంసించారు.

పార్టీలోకి చేరేందుకు రాజారాం ఎన్టీఆర్ భవన్‌కు వచ్చారని, కానీ, కొన్ని పార్టీల్లో చేరాలంటే జైళ్లకో, ఫాం హౌస్‌లకో వెళ్లాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. బీసీలకు తాము ప్రకటించిన వంద సీట్లలో ఒకటి రాజారాంకు ఇచ్చి గెలిపించుకుంటామని, పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవి ఇచ్చి ప్రోత్సహిస్తామని ప్రకటించారు. రాజారాంను పేదల పెన్నిధిగా తయారు చేసేలా పార్టీ సహకరిస్తుందన్నారు. బీసీలకు వంద సీట్లు అని ధైర్యంగా ప్రకటించింది టీడీపీయేనని, ఆ పార్టీలకు బీసీల ఓట్లు కావాలి తప్ప సామాజిక న్యాయం పట్టదని ఆగ్రహించారు.

సీట్లన్నీ సోనియాకు ధారాదత్తం: రాజారాం

టీడీపీ బీసీలకు అనుకూల పార్టీ అని, అందుకే టీడీపీని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని టీడీపీలో చేరిన రాజారాం యాదవ్ అన్నారు. దొరల గడీలో కంటే బీసీలను అభిమానించే పార్టీలో ఉండడం మంచిదని తెలుగుదేశం పార్టీలో చేరానన్నారు. కేసీఆర్‌ను చాలా దగ్గరిగా గమనించానని, ఆయన ప్రవర్తన అహంకారపూరితమని చెప్పారు. 'విద్యార్థుల ఉద్యమం వల్ల వచ్చిన డిసెంబర్ 9 ప్రకటనను కేసీఆర్ ఎన్నికల దిశగా మళ్లించాడు.

కరీంనగర్‌లో గ్రానైట్ మాఫియా నాయకుడు గంగుల కమలాకర్‌కు టికెట్ ఇస్తారట' అని మండిపడ్డారు. నాడు చెన్నారెడ్డి 14 సీట్లను అమ్ముకుంటే ఇప్పుడు కేసీఆర్ అదే దారిలో పయనిస్తున్నాడని, గెలిస్తే అన్ని సీట్లూ సోనియాకు ధారాదత్తం చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై స్పష్టతను ఇస్తూ లేఖ ఇచ్చిన తర్వాత కూడా టీడీపీని ఎందుకు విమర్శిస్తున్నాడని నిలదీశారు. టీడీపీతో బీసీలకు ప్రాతినిథ్యం దక్కుతుందన్న దుగ్ధతోనే కేసీఆర్ టీడీపీని విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. టీఎస్ఎన్వీ రాష్ట్ర కార్యదర్శులు కేశినేని వెంకటేశ్వర్లు, కట్ల నందకిశోర్ ఆధ్వర్యంలో 50 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు బాబు సమక్షంలో పార్టీలో చేరారు.