March 8, 2013

ఆంధ్రప్రదేశ్ కాదు.. అంధకారప్రదేశ్: టీడీపీ

ఆంధ్ర ప్రదేశ్‌ను అంధకార ప్రదేశ్‌గా దిగజార్చడమే తొమ్మిదేళ్ల పాలనలో కాంగ్రెస్ సాధించిన ఘనతని టీడీపీ వ్యాఖ్యానించింది. ఆ పార్టీ నేత కిమిడి కళా వెంకట్రావు గురువారం మీడియాతో మాట్లాడారు.'రైతులకు తొమ్మిది గంటల కరెంటు ఇస్తామని వాగ్దానం చేసి కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ముగ్గురు ముఖ్యమంత్రుల పాలనలో దానిని చివరకు మూడు గంటలకు తెచ్చారు. కరెంటు ఇవ్వలేని అసమర్థత వల్ల 30 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి' అని ఆయన విమర్శించారు. విద్యుత్ ఉత్పత్తికి పైసా నిధులు ఇవ్వకుండా ఆ వ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొలిట్‌బ్యూరో సమావేశాలకు ఉపనేతలు
టీడపీ పొలిట్‌బ్యూరో సమావేశానికి శాసనసభాపక్షం ఉప నేతలను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటిదాకా పొలిట్‌బ్యూరో సమావేశానికి వీరికి ఆహ్వానం లేదు. ప్రస్తుతం టీడీపీ శాసనసభాపక్షానికి నలుగురు ఉప నేతలు ఉన్నారు. వీరిలో అశోక్ గజపతిరాజు ఇప్పటికే పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఉన్నారు. మిగిలిన ముగ్గురు ఉప నేతలు ముద్దు కృష్ణమ నాయుడు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్.రమణలను ఈసారి పిలుస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది. పోయినసారి పొలిట్‌బ్యూరో సమావేశంలో తెలంగాణపై చర్చ జరిగినప్పుడు తనను పిలవకపోవడంపై మోత్కుపల్లి మనస్థాపానికి గురైన విషయం తెలిసిందే.