March 8, 2013

పులితోలు కప్పుకొన్న 'పునీతుడు'!

కైకలూరు రూరల్ : "కొల్లేరును చూస్తే గుండె మండుతోంది, కడుపు తరుక్కుపోతుంది. చేపల చెరువు గట్లను బాంబులతో పేల్చేసి కడప సంస్కృతిని రాజశేఖర్‌రెడ్డి పెంచి పోషించారు. మేం అధికారంలోకి వస్తే కొల్లేరు ప్రజల కంటి నీరు తుడుస్తా''మని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. శుక్రవారం కృష్ణాజిల్లా చాకలిపాడు వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. కైకలూరు, ఆటపాక, గోనెపాడు, సింగాపురం, వదర్గపాడు, భుజబలపట్నం, పల్లెవాడ, ఆలపాడు పొలిమేరల దాకా 15.5 కిలోమీటర్లు నడిచారు. కైకలూరులో స్థానిక శ్యామలాంబ దేవాలయంలో కలిసిన వ్యాపార వర్గాలకు ధైర్యం చెప్పారు. అధికారంలోకి రాగానే వస్త్రాలపై వ్యాట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

వ్యాపారులు సైతం కొంత సమయాన్ని రాజకీయాలకు వినియోగించాలని, అప్పుడే ఆ వర్గాల సమస్యలు పరిష్కరించుకునే వీలు ఉంటుందన్నారు. రాజశేఖర్‌రెడ్డి ప్రజల బాగోగులు పట్టించుకోలేదని, అన్ని వర్గాల ప్రజలను దోచుకున్నారని అన్నారు. పులిచర్మం కప్పుకుని పునీతునిగా ప్రజలను నమ్మించారని మండిపడ్డారు. రాజశేఖర్‌రెడ్డి కొల్లేరు ప్రజలను అప్పట్లో భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఆయన కోవలోనే కొల్లేరుపై కిరణ్ విధానాలున్నాయని ధ్వజమెత్తారు. పాలన పట్ల వీసమెత్తు అవగాహన లేకపోయినా అంతా తెలిసినట్టు గొప్పగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పత్రికను విష కన్యగా ఆయన దుయ్యబట్డారు. "పూర్వం తమ శత్రువులపై ప్రయో గించేందుకు రాజులు విషకన్యలను తయారు చేసేవారు. దానికోసం కన్యలకు చిన్ననాటినుంచే విషం ఇచ్చేవారు. జగన్ పత్రిక కూడా అలాంటి విషకన్యే'' అని దుయ్య బట్టారు. కాగా, బాబుకు సంఘీ భావంగా శని వారం సాఫ్ట్‌వేర్ నిపుణులు పాదయాత్రలో పాల్గొననున్నారు.

'పశ్చిమ'లో మీకోసం..
ఏలూరు: 'మీ కోసం'.. అంటూ పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు అడుగిడనున్నారు. శనివారంతో కృష్ణా జిల్లా యాత్రను ముగించుకుని కృష్ణ-పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుల్లోని ఉప్పుటేరు వంతెన మీదుగా ఉండి నియోజకవర్గంలో ప్రవేశించనున్నారు. ఏడు రోజులు పర్యటించేందుకు వీలుగా ఆకివీడు నుంచి తణుకు వరకు రూట్‌మ్యాప్ ఖరారు చేశారు. తొలిరోజు ఆకివీడుసభలో పాల్గొని, అర్జమూరుగరువువద్ద బసచే స్తారు. కాగా, కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఆలపాడు గ్రామంలో శనివారం టీడీపీ పోలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు.