March 8, 2013

ఐక్యమత్యంతోనే టీడీపీ విజయం


పెదకూరపాడు: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఐకమత్యంతో సైనికుల్లా పనిచేయాలని శాసనసభ్యుడు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ , జీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ వరప్రసాద్ అన్నారు. పెదకూరపాడులోని శ్రీ సాయి శ్రీనివాస కల్యాణ మండపంలో బుధవారం పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు అర్తిమళ్ళ రమేష్ అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు ప్రజల కష్టాలను తెలుసుకునే వ్యక్తి అని, ఆయన రాష్ట్ర నాయకుడిగా ఉంటే పేదల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారన్నారు. గ్రామస్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, చిన్నచిన్న సమస్యలేమైనా ఉంటే పక్కకునెట్టి పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో రాజకీయ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పార్టీ పటిష్ఠతకు సంబంధించి ఎన్ని అడ్డంకులు వచ్చినా రాజీపడే ప్రసక్తేలేదన్నారు. టీడీపీ అందరి పార్టీ అని, ఏ ఒక్కరి సొత్తూ కాదని, పార్టీ పదవులలో సామాజిక న్యాయం పాటిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుతంత్రాలు పన్నినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సహకార ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు.

జీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్, పరసత్యాళ్ళూరు సహకార సంఘ అధ్యక్షుడు ఎన్‌వివిఎస్ వరప్రసాద్ మాట్లాడుతూ, పార్టీ పూర్తిస్థాయిలో విజయం సాధించడానికి ఐక్యమత్యం అవసరమన్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.

సమావేశంలో తెలుగురైతు రాష్ట్ర నాయకుడు నాదెండ్ల అప్పారావు, రిటైర్డ్ డీఎస్పీ బాలశౌరి, మాజీ ఎంపీపీ గల్లా బాబురావు, మండల తెలుగుదేశం నాయకులు ఏరువా బాలిరెడ్డి, నియోజకవర్గ నాయకులు బుర్రి ఏడుకొండలు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు వేగుంట రాణి, చక్కా కేశవరావు, మద్దిరాల గంగాధర్, తాళ్ళూరి వసంతకుమార్, మోదుగుల చంద్రశేఖర్ తదితరులు ప్రసంగించారు. మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు.