March 8, 2013

అడుగడుగులో ఆడపడుచు నీడ!

యాత్రలో హారతులు పట్టేదే కాదు..నా నడకకు నీడనిచ్చేది కూడా ఈ ఆడపడుచులే. నేను మహిళా పక్షపాతిని. తొలి నుంచి వాళ్లూ నా పక్షమే. నా విజయంలో, కష్టంలో నిత్య భాగస్వాములు. స్థానిక సంస్థల్లో కోటా మొదలు.. డ్వాక్రా సంఘాల ఏర్పాటు దాకా.. వాళ్ల గురించి మా పార్టీ ఆలోచించని రోజే లేదు. జనాభాలో సగమని ఇదంతా మేం చేయలేదు. సామర్థ్యమూ చూశాం. మాట నిలకడే కాదు.. ఆర్థిక ముందుచూపునకూ ముచ్చటపడ్డాం. వాళ్లూ నాకు గౌరవం పెంచారు. ఆంధ్రా మహిళకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చిందంటే.. ఆ ఘనత వాళ్లదే. వాళ్ల పట్టుదల, చిన్న అవకాశాన్నీ చేజార్చుకోని అప్రమత్తతే దానికి ప్రధాన కారణం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్లు ఏర్పాటుచేసుకొన్న కార్యక్రమంలో పాల్గొని.. యాత్ర ప్రారంభించాను.

నిజమే..ఈ రోజు దూబగుంట రోశమ్మ గుర్తొచ్చినట్టే, ఢిల్లీ యువతి 'నిర్భయ' జ్యోతి పాండే కూడా పదేపదే గుర్తుకు వస్తున్నది. వీళ్ల కోసం ఎంత చేసినా తక్కువేననిపిస్తోంది. జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోలేనట్టే.. మన ఉన్నతి కోసం ప్రతి అడుగులో ఆసరాగా నిలిచే ఈ ఆడపడుచులకు ఏమిచ్చినా ఇంకా వెలితి ఉంటూనే ఉంటుంది. అవకాశాల్లో సగం అని నినదించడం తప్ప ఆచరణలో వాళ్లకు దక్కుతున్నదేమిటి? పార్లమెంటులో 33 శాతం కోటా కోసం..30 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు కదా! ఆర్థికంగా ఎదిగితే మిగతా సమస్యలను వారే ఎదుర్కొంటారనే ఉద్దేశంతో నా హయాంలో డ్వాక్రా సంఘాలు పెట్టాను. కానీ, కైకలూరులో చూస్తే అవన్నీ డొల్ల సంఘాలుగా మారిపోయాయి. నా ఆశలు, వారి కోరికలు తలకిందులయిపోయాయి. వారంతా ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ కోరల్లో చిక్కుకుపోయారు. ఈ మహిళల కన్నీటి శాపం తగలపోదు!