March 8, 2013

రాష్ట్రంలో పాలన గాడి తప్పింది : లోకేష్ నాయుడు

రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, తిరిగి గాడిలో పడాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని లోకేష్ నాయుడు ఆకాంక్షించారు. మూడు రోజుల పార్యటనలో భాగంగా రెండో రోజైన శుక్రవారం జిల్లాలో పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పూర్తి అవినీతి పార్టీ అని ధ్వజమెత్తారు. ఆ పార్టీని గెలిపిస్తే రాష్ట్రానికి నష్టమేనని అభిప్రాయపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు అవినీతి పార్టీ అయితే, కాంగ్రెసు అసమర్థ పార్టీ అన్నారు.

ప్రజలు టిడిపిని అందలమెక్కిస్తే రాష్ట్రం తిరిగి అభివృద్ధిలో పుంజుకుంటుందని లోకేష్ నాయుడు అన్నారు. రాజకీయాల్లో సామాజిక న్యాయం పాటించిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమే అన్నారు. టిడిపి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తుందన్నారు. గత 2009 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు కాంగ్రెసు పార్టీ రూ.25 కోట్లు ఖర్చు పెట్టిందని, అయినా గెలువలేకపోయిందన్నారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బిసిలకు వంద స్థానాలు ఇస్తామని, అధికారంలోకి వస్తే పదివేల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెడతామన్నారు.