March 8, 2013

గోదావరి దాటేదెటు


చంద్రబాబు మా నియోజకవర్గాలకూ రావాల్సిందే. ఆయన యాత్ర సాగితే ఇక్కడ పార్టీకి మంచి ఊపు వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగపడుతుంది. రెండు రోజులు పెంచినా సరే మావైపు వచ్చేలా చూడండి అంటూ జిల్లా పార్టీ నేతల ఒత్తిళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో చంద్రబాబు పూర్తి పర్యటనను గురువారం వరకు ఖరారు చేయలేకపోయారు. ఆకివీడు నుంచి తణుకు వరకు మాత్రమే రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేయగలిగారు. ఆ తర్వాత ఆయన సిద్ధాంతం మీద నుంచి గోదావరి దాటి ముందుకు సాగాలా, లేదా నిడదవోలు, కొవ్వూరు మీదుగా రోడ్డు కం రైల్ బ్రిడ్జి మీదుగా రాజమండ్రి చేరాలా అనే దానిపై ఇంకా తర్జనభర్జనలు సాగుతూనే ఉన్నాయి. దీనిపై ర్రాష్ట పార్టీ నుంచి కూడా ఇప్పటిదాకా కీలక నిర్ణయం

వెలువడలేదు.

ఆంధ్రజ్యోతి, ఏలూరు : పశ్చిమగోదావరిలో పది రోజుల పాటు మాత్రమే తన పర్యటన ఉండేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇంతకుముందే చంద్రబాబు కూడా పార్టీ నేతలకు సూచించారు. ఆ మేరకు ముందుగా రూపొందించిన రూట్‌మ్యాప్‌ను ఆయన ఓకే చేశారు. అయితే గడిచిన మూడు రోజులుగా ఆయన పాదయాత్రకు సంబంధించిపూర్తిస్థాయి ప్రణాళిక మాత్రం పెండింగ్‌లోనే ఉంది. చంద్రబాబునాయుడు కొవ్వూరు మీదుగా గోదావరి బ్రిడ్జి దాటి రాజమండ్రిలో ప్రవేశించేలా పార్టీ ముఖ్యనేతలు కొందరు గట్టిగా పట్టుపడుతుండటంతో ఇప్పటిదాకా పశ్చిమగోదావరిలో ఆయన పర్యటన తణుకు వరకు మాత్రమే ఖరారు చేయగలిగారు. అక్కడి నుంచి ఎలా ముందుకు సాగాలనేదానిపై మాత్రం తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

గడిచిన రెండు రోజులుగా పార్టీ అధినేత చంద్రబాబు కూడా పూర్తిగా బిజీగా ఉండటం, టీడీఎల్‌పీ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలపై వ్యూహరచన, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశంచ చేయడంలోనూ, ఎమ్మెల్సీ అభ్యర్థ్ధుల ఎంపికలోనూ చంద్రబాబు క్షణం తీరిక లేకుండా ఉండటంతో పశ్చిమలో పూర్తి పర్యటన ఒక కొలిక్కి రాలేదని చెబుతున్నారు. శనివారం నాటికల్లా ఆయన పర్యటనకు తుది రూపు రావచ్చు. ఇప్పటిదాకా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 16వ తేదీ నాటితోనే చంద్రబాబు పాదయాత్ర ఈ జిల్లాలో ముగియగలదని అంచనా వేస్తున్నప్పటికీ ఇది మరో మూడు రోజులు పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

తణుకు నుంచి సిద్ధాంతం బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించాలనుకుంటే ఆయన పర్యటన తొమ్మిది రోజుల్లో ముగియనుంది. లేదంటే కొవ్వూరు మీదుగా వెళ్లాలని భావిస్తేనే మరో రెండు రాత్రులు అదనంగా ఇక్కడ బస చేసేందుకు అవకాశం ఉంది. ఇంకోవైపు చంద్రబాబు పాదయాత్రను విజయవంతం చేసేందు పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేత మాగంటి బాబుతో సహా మిగతా నేతలంతా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక క్రమపద్ధతిలో, క్రమశిక్షణతో ఆయన పాదయాత్రలో పాల్గొనాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం చంద్రబాబు ఉప్పుటేరు దాటి జిల్లాలో కాలిడుతున్న సందర్భంగా భారీగా స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ముందుకు కదలాలని పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలిప్రసాద్‌లు గురువారం విజ్ఞప్తి చేశారు.