March 8, 2013

ఎమ్మెల్సీపై టీడీపీ నాయకుల్లో ఆశలు

శ్రీకాకుళం: టీడీపీ జిల్లా నాయకుల్లో శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల్లో టికెట్ లభిస్తుందని ఆశలు చిగురిస్తున్నాయి. శనివారం జరిగే కోర్‌కమిటీలో ఈ ఎన్నికలపై చర్చించి అభ్యర్థుల పేర్లను వెల్లడించనున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆ పార్టీ అధినేత చంద్రబాబును జిల్లా నేతలు కృష్ణాజిల్లాలో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఈసారి తప్పనిసరిగా జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలని గట్టిగా డిమాండ్‌చేశారు. ఈ నేపధ్యంలో ఆంధ్రజ్యోతి దినపత్రికలో 'అధ్యక్షా.. అనే దేవ రు' శీర్షికతో వెలువడిన కథనం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మిగిలిన జిల్లాల నుంచి పార్టీ తరఫున చట్ట సభల్లో ప్రాతినిధ్యం ఉన్నా శ్రీకాకుళం జిల్లా నుంచి ఎవరూ లేకపోవడమే కాకుండా దివంగత నేత ఎర్రన్నాయుడు లేని లోటు పార్టీపై ప్రభావం చూపుతోందని.. ఈనేపథ్యంలో ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తే పార్టీ క్యాడర్‌లో ఉత్తేజం వస్తుందని నాయకులు బాబుకు వివరించారు.

బాబ్జి ప్రయత్నాలు: జిల్లా టీడీపీ తరఫున 2009 ఎన్నికల తర్వాత పార్టీ పగ్గాలు చౌదరి నారాయణమూర్తి అప్పగించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని సమాచారం. కాగా టీడీపీ నుంచి సామాజిక ప్రాధాన్యత చూసుకొంటే మాజీ మంత్రి సీతారాం అలకపాన్పుపై ఉన్నారు. సాయిరాజ్ పార్టీని వాడారు.ఈ నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత కోసం ప్రధాన సామాజిక వర్గాలతో పోటీ పడాలనే దృష్టితోనే బాజ్జి ఆ పదవిని ఆశిస్తున్నారు.