July 5, 2013

సోనియాని ఎలా కలుస్తారు?: కోదండపై రేవంత్ నిప్పులు

హైదరాబాద్: తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన కాంగ్రెసు పార్టీ నేతలను తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ఎలా కలుస్తారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెసు పార్టీ తెలంగాణ డ్రామా ఆడుతోందని మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ సాధన సభ అందులో భాగమేనని ఆరోపించారు.

తెలంగాణ ప్రజలు కాంగ్రెసు పార్టీని వెలేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వెయ్యి మంది బలిదానాలకు కారణమైన కాంగ్రెసు వారి అపాయింటుమెంట్ కోసం కోదండరామ్ నిరీక్షించడం, తెలంగాణ ప్రజలను అవమానించడమే అన్నారు. రాజకీయ నాయకులు వారి వారి రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడవచ్చు.. కానీ, తెలంగాణ సాధన కోసం పుట్టుకొచ్చిన జెఏసి కాంగ్రెసుకు అనుకూలంగా ఉండటం శోచనీయమన్నారు.

జెఏసి నేతలు కాంగ్రెసు పార్టీ కార్యకర్తల కంటే అధ్వాన్నంగా మారి, ఆ పార్టీని పునర్నిర్మాణం చేసే పనిలో పడ్డారన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలువడమంటే తెలంగాణకు ద్రోహం చేసినట్లే అన్నారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఇచ్చిన విందులో పాల్గొన్నప్పుడు వారికి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంత చారి, వేణుగోపాల్ రెడ్డి ఎవరు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

పదే పదే మోసం చేస్తున్న కాంగ్రెసు పార్టీని కోదండరామ్ ఎందుకు నమ్ముతున్నారన్నారు. నాడు సకల జనుల సమ్మె ఉధృతంగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీ వెళ్లారని, ఇప్పుడు కోదండరామ్ వెళ్లారన్నారు. కాంగ్రెసు నేతలను కలుస్తున్నందుకు కోదండ సమాధానం చెప్పాలని, తెలంగాణ ప్రజలు ఆయనను నిలదీస్తారన్నారు. సీమాంధ్ర సభలు పెట్టుకోవాలని అనుమతిచ్చిన దిగ్విజయ్ సింగ్ కోసం కూడా నిరీక్షించడం దారుణమన్నారు.