July 5, 2013

ఇక టీఆర్ఎస్ మాయం :ఎర్రబెల్లి దయాకర్‌రావు

రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు జోస్యం చెప్పారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎర్రబెల్లి హాజరయ్యారు. సకల జనుల సమ్మె కొనసాగి ఉంటే కేంద్రం దిగి వచ్చేదన్నారు. అనుకూల ప్రకటన వచ్చే సమయానికి కేసీఆర్ ఢిల్లీలో రూ.500 కోట్ల ప్యాకేజీ తీసుకున్నారు. అటు సమ్మెను, ఇటు ఉద్యమాన్ని నీరుగార్చాడని ఆరోపించారు. కేసీఆర్ ఏ మీటింగ్‌లోనూ సోనియాను విమర్శించలేదని , దానికి కారణమేంటో అందరికీ తెలుసన్నారు. కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకువచ్చి మంత్రి పదవి వచ్చేలా అధిష్ఠానంపై ఒత్తిడి చేసింది నేనేనన్నారు. అలాంటి శ్రీహరి విశ్వాసం లేకుండా నాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

వరంగల్ కాజీపేటలోని ఫాతిమానగర్ బిషప్ బరెట్టా హైస్కూల్ ప్రాంగణంలో ఈ నెల 7వ తేదీన జరుగనున్న తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సభకు యుద్ధప్రాతిపదికపై విస్త­ృత స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్‌తో పాటు కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి సుమారు 20వేల మందికిపైగా ప్రతినిధులు హాజరుకానున్న ఈ సభను విజయవంతం చేయడానికి జిల్లా నాయకులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. సభా నిర్వహణకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉండడంతో ఏర్పాట్లు త్వరితగతిన పూర్తయ్యే ట్టు చూస్తున్నారు. వర్షం వల్ల అంతరాయం కలుగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సువిశాలమైన సభా ప్రాంగణం అంతా టార్పాలిన్లు, టెంట్లకు బదులు ఇనుప రేకులతో పైకప్పును వేస్తున్నారు. టీడీపీ జిల్లా నేతలు శుక్రవారం సాయంత్రం సభా ప్రాంగాణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ఏర్పాట్లన్నీ శనివారం మధ్యాహ్నానికే పూర్తవుతాయని చెప్పారు. ఆదివారం ఉదయం 9గంటల నుంచి సభా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని చెప్పారు.

పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తొలుత సభా ప్రాంగణంలో పార్టీ పతాకాన్ని అవిష్కరిస్తారని, అనంతరం ఎన్‌టీఆర్ చిత్రపటానికి పూలమాల వేస్తారని చెప్పారు. సభా ప్రారంభానికి ముందు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటిస్తారని, చార్‌ధామ్ మృతులకు సంతాపం ప్రకటిస్తారని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు రానున్న మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, అందుకు పార్టీ శ్రేణులు చేయవలసిన కృషిపై సభలో ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పారు.