July 5, 2013

అసెంబ్లీ ఎన్నికలకు ‘పంచాయతీ’యే పునాది


పట్టం గడితే గ్రామాల్లో వెలుగులు నింపుతా తెలుగుజాతి ప్రతిష్ఠను పునరుద్ధరిస్తా.. చరిత్ర తిరగరాస్తా అవినీతి సొమ్మును నయాపైసలతో కక్కిస్తా టిడిపి నాలుగు జిల్లాల ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు ============ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టంకడితే వౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన స్వపరిపాలనతో గ్రామాల్లో వెలుగులు నింపడంతో పాటు అవినీతి, అక్రమాలతో అవమానాలపాలవుతున్న తెలుగుజాతి ప్రతిష్ఠను పునరుద్ధరించి చరిత్రను తిరగ రాసేందుకు శ్రీకారం చుడతానని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రస్తుతం పంచాయతీల్లో పెరిగిన ఆర్థిక భారాలతో విద్యుత్ దీపాలు వెలగడం లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక విద్యుత్ స్తంభాలు కూడా ఉండవని ఎద్దేవా చేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కంకిపాడు మండలం ఈడుపుగల్లులో గురువారం జరిగిన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు ఎంతో ఉద్వేగంతో మాట్లాడుతూనే అనేక హామీలు గుప్పించారు. పేదరికంలేని సమాజాన్ని ఈ రాష్ట్రంలో చూడాలనేది తన లక్ష్యమని, కలలో కూడా ఇదే విషయం ఆలోచిస్తుంటానని, అందుకే రానున్న సాధారణ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ముచ్చటగా మూడు ఫైళ్లపై సంతకాలు చేస్తానని ప్రకటించారు. మొదటగా రైతు రుణ మాఫీ, ఆ తర్వాత మద్యం అమ్మకాలపై నియంత్రణ, ఎన్టీఆర్ జలప్రభ పేరిట అన్ని గ్రామాలకు సురక్షిత మంచినీరు అందించేందుకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో కుల మతాలు ఇతర ప్రయోజనాలను పక్కనబెట్టి నిస్వార్థమైన నేతలను ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. టిడిపి అధికారంలోకి వస్తే అవినీతిపరులు దిగమింగిన ప్రజాధనాన్ని నయాపైసలతో సహా కక్కించి ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఉపాధి చూపాల్సిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు అవినీతిపరులైన వైఎస్, జగన్ అనుయాయులతో నిండిపోయిందని, దీనిని సమూలంగా ప్రక్షాళన చేసి సమర్థులను నియమించేదాకా పార్టీ తరఫున పోరాటం చేస్తామని చంద్రబాబు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జలయజ్ఞం పేరిట 86 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తే సాగు విస్తీర్ణం పెరగకపోగా 25 వేల ఎకరాలు తగ్గిందన్నారు. తన హయాంలో ప్రారంభమైన పులిచింతల ప్రాజెక్టు ఏనాడో పూర్తికావాల్సిందని, ఇప్పటి వరకూ ఏ ప్రాజెక్టూ కొలిక్కి రాలేదని, కాంట్రాక్టర్ల నుంచి పాలకుల వరకూ ఎవరికి అందినంత వారు దోచుకోవడమే ఇందుకు కారణమని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు సూచించిన విధంగా సిబిఐకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తే ప్రస్తుత మంత్రుల్లో కనీసం 75 శాతం మంది జైళ్లకు వెళ్తారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ప్రజా సమస్యలేమీ పట్టడం లేదని, అవినీతిపరులైన మంత్రులను రక్షించే పనిలో ఆయన తలమునకలైపోయారని నిప్పులు చెరిగారు. తొలుతగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావుతో పాటు ఇటీవల మృతిచెందిన కింజరాపు ఎర్రంనాయుడు, అంబటి బ్రాహ్మణయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయంత్రం పాత బస్టాండ్ సమీపంలో పార్లమెంటు నియోజకవర్గ టిడిపి కార్యాలయం ‘కేశినేని భవన్’ను చంద్రబాబు ప్రారంభించారు. కృష్ణా జిల్లా టిడిపి అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు సీతామహాలక్ష్మి, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. (చిత్రం) తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సదస్సులో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు