July 5, 2013

పంచాయతీల్లో పచ్చ జెండా ఎగరాలి : టీడీపీ అధినేత

కొండవీటి సంహాలై విజృంభించండి
పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు
టీఆర్ఎస్‌కు ఓటు వేయడం దండగ
బెయిల్ కోసమే వైసీపీ ఓట్లు అడుగుతుంది
తిరుపతి సదస్సులో టీడీపీ అధినేత


రాష్ట్రంలో కొత్తగా పుట్టుకొచ్చిన రెండు పార్టీలూ త్వరలో కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయమని, రాష్ట్ర చరిత్రలో 30 ఏళ్లుగా ప్రజల కోసం నిలబడి పోరాడిన పార్టీ తమదేనని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అలాంటి పార్టీకి వారసులైనందుకు ప్రతి కార్యకర్త్తా గర్వపడాలన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ జెండా రెపరెపలాడించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాంతీయ సదస్సులో పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. వచ్చేది ఎన్నికల సంవత్సరమని, పంచాయతీ ఎన్నికలతోనే టీడీపీ విజయ పరంపర కొనసాగాలని పిలుపునిచ్చారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పార్టీ కార్యకర్తలు కొండవీటి సింహాలై విజృంభించాలన్నారు.

ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆ తరువాత మునిసిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకేనని పేర్కొన్నారు. "2014 ఎన్నికల్లోనూ గెలుపు మనదే. అధికారంలోకి రాకుండా మనల్ని ఎవరూ ఆపలేరు'' అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రతిపక్షాలుగా కనిపించే వైసీపీ, టీఆర్ఎస్ ఎన్నికల నాటికి ఉండవని, కాంగ్రెస్‌లో విలీనం అయిపోతాయని జోస్యం చెప్పారు. ఈ పార్టీలకు దోచుకోవడం తప్ప ప్రజా సంక్షేమం పట్టదన్నారు. ఉత్తరాఖండ్‌లో వేలాదిమంది తెలుగువారు ఆపదలో చిక్కుకుంటే వ్యక్తిత్వం లేని సీల్డ్‌కవర్ సీఎం.. ఢిల్లీలో సోనియా ఇంటర్వ్యూ కోసం పడిగాపులు కాస్తూ కూర్చున్నారని ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టి జైల్లో ఉన్న జగన్‌కు బెయిల్ తెప్పించుకోవడం కోసమే వైసీపీ ఓట్లు అడుగుతోందని చంద్రబాబు విమర్శించారు. టీఆర్ఎస్ వసూళ్ల పార్టీ, బెట్టింగ్‌ల పార్టీ, మ్యాచ్‌ఫిక్సింగ్‌ల పార్టీ అంటూ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్‌కు ఓటు వేసినా నిరుపయోగమేనన్నారు.

ఈ రెండు పార్టీలూ అవినీతికి పుట్టినిల్లు అయిన కాంగ్రెస్్‌లో విలీనం కావడం ఖాయమని చెప్పారు. ప్రాంతీయ సదస్సుకు ఐదు జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు. కార్యకర్తల్లో సమరోత్సాహం కనిపించింది. కాగా, స్థానిక ఎన్నికల సమరంలో పార్టీ శ్రేణులు క్రియాశీల పాత్ర పోషించేలా చైతన్యం చేయడానికి టీడీపీ నిర్వహిస్తున్న ప్రాంతీయసదస్సు శనివారం హైదరాబాద్‌లో జరగనుంది. మేడ్చల్ రోడ్డులోని కొంపల్లిలోగల ఎక్స్‌లెన్సీ గార్డెన్‌లో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల నుంచి గ్రామ, మండల స్థాయి పార్టీ నేతలు పాల్గొంటారు.