July 8, 2013

భవిష్యత్‌లో కేంద్రంలో చక్రం తిప్పనున్న టీడీపీ : బాబు

వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లతో గెలుస్తుందని, కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కాజీపేటలోని ఫాతిమానగర్ బిషప్ బరెట్టా స్కూల్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన తెలుగు దేశం పార్టీ ప్రాంతీయ సభకు హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలలో పసుపు జెండా ఎగురవేయాలన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింటుమెంట్ కోసం ఐదు రోజులు పడిగాపులు కాసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తరాఖండ్ బాధితుల కోసం ఒక్కరోజును కేటాయించలేదన్నారు. తమ మహాలక్ష్మి పథకాన్నే బంగారుతల్లిగా మార్చారన్నారు.

టిడిపి అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యార్థుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగమిస్తామన్నారు. విద్యార్థులు, ఉద్యోగుల పైన ఉన్న కేసులను ఎత్తివేస్తామన్నారు. రేపు, ఎల్లుండో పిల్ల కాంగ్రెసు తల్లి కాంగ్రెసులో కలువడం ఖాయమన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి వసూళ్ల పార్టీ అని, ఆ పార్టీ నాయకులు ఉద్యమం పేరుతో టిక్కెట్లు అమ్ముకుంటున్నారని చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ పార్టీకి సాధారణ ఎన్నికలలో గెలిచే సత్తా లేదని చంద్రబాబు అన్నారు. టిఆర్ఎస్ నేతల పైన ఎవరైనా ఆరోపణలు చేస్తే వారిపై దాడులు చేస్తారని, ఇదేం సంస్కృతి అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి రానున్న 20వేల మందికిపైగా ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని వసతులు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ముందుగా చంద్రబాబు సభా ప్రాంగణంలో పార్టీ పతాకాన్ని అవిష్కరించారు. అనంతరం వేదికపై ఎన్‌టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తర్వాత తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. చార్‌దాం వరదల్లో చిక్కుకొని మృతి చెందినవారికి కూడా సభలో సంతాపాన్ని ప్రకటించారు.