July 8, 2013

జ్యుడీషియల్ విచారణ జరిపించాలి : చంద్రబాబు

 సికింద్రాబాద్, రాష్ట్రపతి రోడ్‌లో ఉన్న సిటీ లైట్ హోటల్ భవనం సోమవారం కుప్పకూలిన ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. హోటల్ కూలిన విషయం తెలియగానే ఆయన హుటాహుటిన సంఘటనా ప్రదేశానికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ పరిస్థితిని పరిశీలించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ జరిగిన ఘటన చూస్తుంటే చాలా హృదయవిదారకంగా ఉందని ఆయన ఆదేవన వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకు 12 మంది మృతి చెందగా మరో 30 మంది తీవ్రంగా గాయపడగా మరెందరో శిథిలాల కింద చిక్కుకుని సహాయం కోసం రోదనలు చేస్తుంటే గుండె తరుక్కుపోతుందని చంద్రబాబు అన్నారు. ఇది చాలా పురాతనమైన భవనం, దీనికి సంబంధించిన వివరాలు మున్సిపల్ అధికారుల వద్ద ఉంటాయి. వాటిని బట్టి పురాతన భవనాలకు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా సిటీ లైట్ హోటల్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదో విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.

ఈ రోజున చూస్తే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. వీటన్నిటికి అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం ఉదాసీనత వల్లే జరుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఒకవైపే భవనం కూలింది. మొత్తం కూలితే ఏ వంద మందో మృతి చెందేవారని బాబు పేర్కొన్నారు. అధికారులు స్పందించే తీరుపై కూడా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఘటనా స్థలంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రెండు నిముషాలు మాత్రమే ఉండి పారిపోయారని చంద్రబాబు విమర్శించారు. ఇలాంటి సమయంలో సీఎం సంఘటనా ప్రదేశం వద్దే ఉండి సమాయక కార్యక్రమాలు చూడాల్సిన బాధ్యత ఆయనదేనని అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం సరికాదని, ఈ విషయన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు.

ఇది పరిపాలనా పద్ధతి కాదని, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమని, దీనికి ప్రజల ప్రాణాలు పోయాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, గాయపడిన వారికి కూడా మెరుగైన వైద్యం అందించి, నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుంటుంబాలకు ఆయన తన తీవ్ర ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.