July 8, 2013

బాబు ఒంటరి పరుగు

రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల పోరుకు నగారా మోగింది. కానీ ఇక్కడ ఓ చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. వైకాపా పార్టీ ప్రస్తుతం ఎటూ తోచని స్థితిలో వుంది. దిశా నిర్దేశం చేయాల్సిన నాయకుడు కరువయ్యాడు. గెలవాలి అని చెప్పడమే కానీ, ఎలా గెలవాలి.. అందుకు ఏం చేయాలి అన్నది పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ చెప్పడం లేదు. ఇక కాంగ్రెస్ లో తెలంగాణా మల్లగుల్లాలు నడుస్తున్నాయి. ఇరు ప్రాంతాల నేతలు ఢిల్లీలో పార్టీ నాయకులు చెవులు కొరికి పారేయడంలో మహా బిజీగా వున్నారు. మెగాస్టార్ చిరంజీవి, తన కొడుకు సినిమా ఆడియో ఫంక్షన్ అయిపోగానే మరి పత్తాలేరు. కొనేసి అయినా గెలిచేయండి అంటూ పిసిసి అధ్యక్షుడు హితోపదేశం మినహా చేసిందేమీ లేదు. వామపక్షాలకు ఈ ఎన్నికలు పెద్దగా పట్టినట్లు లేదు. మోడీ వచ్చేసాడు.. ప్రధాని పీఠం మాదే, ఇంతవరకు తాము చేసిందీ లేదు. ఇకపై చేసేదీ లేదు.. అన్నట్లుగా బీజేపీ నేతలున్నారు.

కానీ తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు ఒక్కరే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్రాంతీయ సమావేశాలు చకచకా పూర్తి చేసి క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలా ఇక్కడ బాబు రెండు లక్ష్యాలు పూర్తి చేశారు. ఒకటి పంచాయితీ ఎన్నికలపై సీరియస్ గా పనిచేయడం. రెండవది, నాయకుల దృష్టి తెలంగాణా తలకాయ నొప్పులపైకి వెళ్లకుండా చేయడం. ఇదేదో బాగానే ఉంది. కానీ పోటీ వుంటేనే రంజుగా వుంటుంది. ఎవరూ ఏ హడావుడి చేయకపోవడంతో, బాబు ఒక్కరే చేస్తున్నా, పెద్ద సందడిగా లేదు. రేస్ లో పోటీదారులు ఎవరు లేకుండా, బాబు ఒక్కరే పరుగెడుతున్న చందంగా వుంది.