July 8, 2013

ప్రజాసేవకే అధికారం............మంచివారినే రాజకీయాల్లో ప్రోత్సహిస్తాం

సైద్ధాంతికంగా కోరుకుంటున్నాం
పాదయాత్ర పుస్తకావిష్కరణలో చంద్రబాబు
తమ పార్టీకి అధికార కాంక్ష ఉందని స్పష్టం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దానిని ప్రజా సేవకే వినియోగిస్తాం తప్ప స్వప్రయోజనాల కోసం వినియోగించమన్నారు. ఆయన చేసిన ''వస్తున్నా.. మీ కోసం'' పాదయాత్రను పాత్రికేయుడు తేలప్రోలు శ్రీనివాస రావు అదే పేరుతో అక్షరబద్దం చేసిన పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా ఆయన వచ్చారు. రవీంద్రభారతిలో సోమవారం పుస్తక ఆవి ష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ సైద్ధాంతి కంగా తమ పార్టీ అధికారాన్ని కోరుకుంటుందని స్పష్టం చేశారు. వ్యక్తులు జీవిక కోసం వర్తక, వాణిజ్యాలు చేయాలి తప్ప రాజకీయాలు కాదని చెప్పారు. రాజకీయాల్లో మంచి వారిని ప్రజలే ప్రోత్సహించాలన్నారు. తన 208 రోజుల సుదీర్ఘ పాదయాత్ర జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టమని చెప్పారు. శరీరం సహకరించని ఇబ్బంది ఒకవైపుంటే ప్రజల ఆదరాభిమానాలు వాటిని మరిపించేవన్నారు. కేవలం పట్టుదలతోనే యాత్రను పూర్తి చేశానని చంద్రబాబు చెప్పారు. యాత్రలో ఉన్నప్పుడే ఎర్రన్నాయుడు మృతి చెందడం తనకు తట్టుకోలేని బాధను మిగిల్చిందన్నారు. ఇంకా నీలం తుపాను, హైదరాబాద్‌లో పేలుళ్లు, అంబటి బ్రాహ్మణయ్య మృతి లాంటి సంఘటనలన్నీ పాదయాత్ర సాగుతుండగా చోటు చేసుకున్నవేనన్నారు.

స్వాతంత్య్రానంతరం దేశంలో ఏర్పడిన నాలుగు కాంగ్రేసేతర ప్రభుత్వాలలో మూడు ప్రభుత్వాలు టీడీపీ చొరవతోనే ఏర్పడినాయని చంద్రబాబు గుర్తుచేశారు. ఆ విషయమై తెలుగువాడిగా తనకు ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. అబ్దుల్‌ కలాం రాష్ట్రపతిగా ఎంపికవడం వెనక తన కృషి ఉందని చెప్పారు. భారత్‌కు వచ్చిన నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ హైదరాబాద్‌ రావడమే కాకుండా తనతో చాలా సేపు ఏకాంతంగా మహావీర్‌ ఆస్పత్రిలో ముఖాముఖి సంభాషించినట్లు చెప్పారు. ఆయన సూచనల మేరకు అనంతరం ఆనాటి ఇంగ్లండ్‌ ప్రధాని టోనీ బ్లెయిర్‌ సైతం హైదరాబాద్‌ వచ్చినట్లు వెల్లడించారు. తన హయాంలో తయారు చేసిన విజన్‌-2020 డాక్యుమెంట్‌ ఒక అద్భుత మార్గదర్శిగా నిలిచిందన్నారు. దాని స్ఫూర్తితోనే నాటి రాష్ట్రపతి కలాం దేశానికి అలాంటిది ఉండాలని తలచారన్నారు. ఒకప్పుడు తన కుప్పం నియోజకవర్గం మొత్తం రెండు మూడు వందల ఫోన్లకు మించి ఉండేవి కావన్నారు. ఇప్పుడు వాటి సంఖ్య 60వేలకు చేరిందన్నారు. అప్పట్లో ప్రధానిగా ఉన్న వాజ్‌పేయికి తాను నచ్చజెప్పడం మూలంగానే దేశంలో టెలికాం అభివృద్ధికి బీజం పడిందని చెప్పారు. తనపై యాత్రను అక్షరబద్దం చేసిన రచయితకు అభినందనలు తెలిపారు. అంతకు ముందు మాట్లాడిన సీనియర్‌ పాత్రికేయులు కె. రామ చంద్రమూర్తి చంద్రబాబు లాంటి సమర్థునికి దేశ ప్రధాని అయ్యే అర్హత ఉందన్నారు. మరో పాత్రికేయుడు వాసుదేవ దీక్షితులు ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన నేతగా చంద్రబాబును విశాలాంధ్ర సంపాదకుడు శ్రీనివాసరెడ్డి ప్రశంసించారు. టీవీ జర్నలిస్టు వెంకట రమణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

'ఒకే ఒక్కడు' నేనే

అప్పట్లో తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిన 'ఒకే ఒక్కడు' సినిమా నిర్మాణానికి తానే ప్రేరణ అని చంద్రబాబు చెప్పారు. అప్పట్లో చిత్ర దర్శకుడు శంకర్‌ తనను కలిసి అదే విషయం చెప్పారని గుర్తు చేశారు. అప్పట్లో తన పరిపాలన శైలి, వేగం, దూకుడు ప్రేరణగా తీసుకుని ఆ సినిమా నిర్మించినట్లు దర్శకుడు చెప్పారన్నారు.