April 28, 2013

వస్తున్నా మీకోసం.. ప్రజలకే అంకితం!విజయ స్థూపం ఆవిష్కరణ

ముగిసిన బాబు పాదయాత్ర
బాబు వెంట నడిచిన బాలయ్య

విశాఖపట్నం :సుదీర్ఘ పాదయాత్రకు బహుదూరపు బాటసారి చంద్రబాబు తెరదించారు. ఏకబిగిన ఏడు నెలలపాటు నడిచిన పాదాలకు విశ్రాంతి ఇచ్చారు. రాష్ట్రంలోని నైరుతి దిక్కున వర్షాకాలం చివరిలో మొదలు పెట్టిన యాత్రను నడివేసవిలో ఈశాన్య దిక్కున ముగించారు. పదహారు జిల్లాల్లోని 86 నియోజకవర్గాల్లో 208 రోజులపాటు 2817 కిలోమీటర్లు నడిచిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

శుక్రవారం రాత్రి కూర్మన్నపాలెంలో బసచేసిన ఆయన శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడి నుంచి శివాజీనగర్‌లో ఏర్పాటు చేసిన 'విజయ స్థూపం'(పైలాన్) వరకు దాదాపు కిలోమీటరుపాటు నడిచారు. దీంతో ఏడు నెలలపాటు సాగిన పాదయాత్రకు తెరపడింది. పాదయాత్రకు గుర్తుగా ఏర్పాటు చేసిన పైలాన్‌తోపాటు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ప్రజలకే అంకితం.. 'వస్తున్నా మీకోసం' యాత్రను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు అంకితం చేశారు. పైలాన్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఇదే నినాదం చేశారు. 'వస్తున్నా మీకోసం... ప్రజలకే అంకితం' అంటూ... "208 రోజులు... 2817 కిలోమీటర్ల కాలినడక... మూడు ప్రాంతాలు... 1253 గ్రామ సీమల కన్నీటి గాథలు... అడుగడుగునా ఆత్మబంధువులతో బాధలు పంచుకున్న వైనం... దేశ రాజకీయ చరిత్రలో సుదీర్ఘ ప్రయాణం... తెలుగుజాతి గుండెల్లో పదిలంగా మిగిలిపోయే జ్ఞాపకం... ఆరుపదుల వయసులో అనితర సాధ్యమైన సాహసం.... అందరి కష్టాలు వింటూ... మంచిరోజులు వస్తాయని భరోసా ఇస్తూ ముందుకు సాగిన మరో సత్యాగ్రహం...

ప్రజలు కష్టాలు మరిచిన ప్రభుత్వ నిర్లక్ష్యంపై జాతి జనుల ఆగ్రహ జ్వాలకు ఇది శిలాక్షర రూపం' అని శిలాఫలకంపై లిఖించారు. పాదయాత్ర చివరి రోజున చంద్రబాబుతోపాటు సినీ నటుడు బాలకృష్ణ, లోకేశ్, భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు, పార్టీకి చెందిన సీనియర్ నేతలు పాల్గొన్నారు. పవర్ గ్యారెంటీ 8ఓ వ్యక్తి చంద్రబాబుకి నాగలిని బహుమానంగా ఇస్తూ తాను గతంలో జమ్ముకాశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లాకు, యూపీలో ములాయం సింగ్ యాదవ్‌కు ఇలాగే ఇస్తే.. వారు ముఖ్యమంత్రులు అయ్యారని, త్వరలో మీరు కూడా అవుతారంటూ మైకులో ప్రకటించాడు.