April 28, 2013

నేనొస్తా..దారికి తెస్తా...............జన చైతన్యం కోసమే నా యాత్ర..

ప్రతి హామీ నెరవేరుస్తా..
పెద్ద కొడుకునై అండగా ఉంటా
పేదరికం లేని సమాజమే నా లక్ష్యం
అసమర్థ ప్రభుత్వంతో అందరికీ కష్టాలే
అన్ని వర్గాలను ఆదుకుంటాం
ఆడబిడ్డలకు ఆత్మగౌరవం,భద్రత మభ్యపెట్టి వైఎస్ మోసం
ఆయన అవినీతి సోనియాకు తెలియదా?
కిరికిరి కిరణ్‌వి ఉత్తి మాటలే..
జగన్ దోచిన సొమ్ము రికవరీ చేయరేం?
పిల్ల కాంగ్రెస్‌కు వ్యక్తిత్వం లేదు..
టీఆర్ఎస్‌ది ఫామ్‌హౌస్‌లో కుంభకర్ణుడి నిద్ర
పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు నిప్పులు

దారిపొడవునా ప్రతికూడలి వద్ద చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజల నుంచి మంగళహారతులతో ఘనస్వాగతం లభించింది. బహిరంగ సభ ఏర్పాటు చేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం సూర్యాస్తమయానికి ముందే ప్రజలతో కిటకిటలాడింది. చాలా దూరం వరకు మైకులు ఏర్పాటు చేయడంతో ప్రజలు రోడ్లపైనే నిలబడి కూడా ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పలువురు నేతలు చేసిన ఆసక్తికరమై ప్రసంగాలకు సభికుల నుంచి కరతాళధ్వనులతో ప్రశంసలు లభించాయి. సినీహీరో బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యువ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గంభీర స్వరంతో చేసిన యాంకరింగ్ సభికులను ఆకట్టుకుంది.

చంద్రబాబు సభా వేదికపైకి వస్తున్నప్పుడు అనేకమంది కార్యకర్తలు ఆయనకు పాదాభివందనాలు చేశారు. మహిళా నేతలు మంగళహారతులు ఇచ్చారు. సభావేదికపై ఉన్న నాయకులంతా లేచి నిలబడి ఎదురేగి ఆయనకు స్వాగతం పలికి వేదికపైకి తోడ్కొనివచ్చారు. సభా ప్రాంగణమంతా ఇసుకేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. విశాఖ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు సభ విజయవంతమైంది. ఈ సభకు మూడులక్షలకుపైగా జనం హాజరైనట్టు పోలీసు అధికారులు భావిస్తున్నారు. గతంలో ఎన్‌టీ రామారావు 1982లో టీడీపీని స్థాపించిన అనంతరం ఏప్రిల్‌లో విశాఖలోని మున్సిపల్ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు.

ఇప్పటి వరకు విశాఖ చరిత్రలో అదే అతిపెద్ద సభగా పేర్కొంటారు. దానిని తలదన్నేలా శనివారం చంద్రబాబు సభ జరిగింది. సభను విజయవంతం చేయడంలో ఉత్తరాంధ్ర టీడీపీ శ్రేణులు తమ శక్తిని ప్రదర్శించాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నేతలు తమ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో తరలివచ్చారు. లక్షల సంఖ్యలో ప్రజల హాజరు చంద్రబాబు పాదయాత్ర ముగింపుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశాఖకు పొరుగున్న తూర్పుగోదావరి జిల్లానుంచి కూడా గణనీయుంగా పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. అధినేత పాదయాత్ర ముగింపు సభను 'నభూతో నభవిష్యత్' అన్నచందంగా నిర్వహించామని నాయకులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. చంద్రబాబు సభ విశాఖ చరిత్రలోనే కాకుండా ర్రాష్ట చరిత్రలోనే చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుందని వారు పేర్కొంటున్నారు.

ఒకరిద్దరు మినహా నేతలంతా హాజరు రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని జిల్లాల నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు తరలిరావడంతో సభాప్రాంగణం టీడీపీ రాష్ట్ర కార్యాలయం మాదిరిగా కనిపించింది. ఇదే సమయంలో కొందరు ప్రముఖుల గైర్హాజరు కూడా రాజకీయవర్గాల్లో ఆసక్తిని కలిగించింది. పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్న నందమూరి హరికృష్ణ, దాడి వీరభద్రరావు, కడియం శ్రీహరి, సుద్దాల దేవయ్య, జైపాల్ యాదవ్ ఈ సభకు రాలేదు. చంద్రబాబుతో కొంతకాలంగా అంటీముట్టనట్టుగా ఉంటున్న హరికృష్ణ తనకు ఆరోగ్యం బాగోలేనందువల్ల రాలేకపోతున్నానని పార్టీ నాయకులతో చెప్పారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సమయంలో ఏర్పడిన వివాదంతో బాబు పాదయాత్రకు దూరంగా ఉన్న దాడి వీరభద్రరావు కూడా ఈ కార్యక్రమానికి రాలేదు. విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన కుమారుడు దాడి రత్నాకర్ మాత్రం చురుకుగా పాల్గొన్నారు. ఇటీవల కాలంలో కొంత అసంతృప్తిగా ఉన్న కడియం శ్రీహరి కూడా ఇటువంటి కారణాలతోనే గైర్హాజరై ఉంటారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, నందమూరి కుటుంబానికి చెందిన సినీహీరో తారకరత్న కూడా పాల్గొన్నారు. సినీరంగానికి చెందిన వందేమాతరం శ్రీనివాస్, మనో, సునీత, తదితరుల బృందం ఆలపించిన గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి. సినీ నటుడు ఏవీఎస్ కూడా వారితోపాటు పాల్గొన్నారు.
విశాఖపట్నం: విశాఖ తీరం జనసంద్రమైంది. సాగర కెరటాలకు పోటీగా జనవాహిని కెరటాలు నగరాన్ని ముంచెత్తాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో శనివారం నిర్వహించిన ర్యాలీ, బహిరంగ సభ భారీ జనసందోహంతో కళకళలాడాయి. పాదయాత్ర ముగింపు సందర్భంగా నగర శివారులోని అగనంపూడిలో ఏర్పాటుచేసిన పైలాన్‌ను చంద్రబాబు శనివారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. అక్కడనుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహిరంగ సభ ప్రాంగణం వరకు జరిగిన ర్యాలీ కనీవినీ ఎరగని స్థాయిలో జరిగింది. వేల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, వందల సంఖ్యలో ఇతర వాహనాలు, వాటిని అనుసరిస్తూ వేలాదిమంది కార్యకర్తలతో విశాఖ పసుపురంగు పులుముకుంది.