April 28, 2013

ప్రజల వల్లే ధైర్యం అవాంతరాలు ఎదురైనా నడక ఆగలేదు

ఎంత చెప్పినా ససెమీరా అన్నారు
తెలంగాణలోనూ టీడీపీ పట్టు సడలలేదు..
పాదయాత్ర సమన్వయకర్త గరికపాటి


విశాఖపట్నం: ఆరు పదులు నిండిన వ్యక్తి అలుపెరగకుండా అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఏడు నెలలు... 2,817 కిలోమీటర్లు పాదయాత్ర చేశారంటే.. అదంతా రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మనోధైర్యమేనంటూ చంద్రబాబు పాదయాత్ర సమన్వయకర్త గరికపాటి మోహనరావు పేర్కొన్నారు. యాత్రకు సంబంధించిన కొన్ని విషయాలు మీకు చెప్పాలంటూ బాబు పాదయాత్ర ముగింపు సభా వేదికపై ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని ఆంజనేయస్వామి గుడిలో కొబ్బరికాయ కొట్టి కుడి పాదంతో తొలి అడుగు వేసి ప్రారంభించిన పాదయాత్ర ఏడు నెలలు కొనసాగగా, కొన్నిసార్లు ప్రతికూలతల వల్ల అవాంతరాలు ఎదురయ్యాయన్నారు.

బాబు యోగా చేస్తారు కాబట్టి ఆయనకు ఆరోగ్యం బాగుంటుందని అనుకుంటారు. కానీ వాటికంటే ప్రజలు చూపిన అభిమానమే ఆయన్ను ఇంతకాలం నడిపించిందన్నారు. గద్వాల్‌లో వేదిక విరిగి కింద పడినపప్పుడు ఆయన వెన్నెముక దెబ్బతిన్నదని తామంతా ఆందోళన చెందామని, మరుసటి రోజు వైద్యులు వచ్చి ఫరవాలేదని చెప్పేంతవరకు నాయకులు, కార్యకర్తలు ఎవరికీ కంటి మీద కునుకు లేదన్నారు. చంద్రబాబు తమ ప్రాంతంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అన్నవారు పాదయాత్ర తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవేశించినప్పుడు అడ్రస్ లేకుండా పోయారన్నారు. తెలంగాణ ప్రజలు అశేషంగా తరలివచ్చి తెలుగుదేశానికి ఏమాత్రం పట్టుసడల్లేదని నిరూపించారని, అలా ధైర్యం నింపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఆదిలాబాద్‌లోని దట్టమైన అడవుల గుండా పాదయాత్ర చేశామని, ఆయన కాలి చిటికెన వేలు బాగా వాచిపోయిందన్నారు. డాక్టర్లు నడవద్దని చెప్పినా ఆయన వినకుండా మొండిగా ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేశారన్నారు. గుంటూరు జిల్లాలోనూ వేదిక కూలినప్పుడు ఆయన పరిస్థితి చూసి యాత్ర విరమించుకోమని తాము సూచించామని.. చంద్రబాబు మాత్రం ప్రజల కోసం నడుస్తానంటూ కొనసాగించారన్నారు. తుని దగ్గరకు వచ్చేసరికి మళ్లీ కాలు నొప్పి అధికమైందని, రెండు రోజులు విశ్రాంతి తీసుకుని కొనసాగించారే తప్ప అర్ధంతరంగా ఆపడానికి ఆయన ఒప్పుకోలేదని గరికపాటి వివరించారు.

"కనపడిన ప్రతి రాయికి, ప్రతి దేవతకి మొక్కాం. ఏడుకొండల వాడిపై భారం మోపాం. అనంతపురం ఆంజనేయస్వామిని వేడుకొన్నాం. షిర్డీ సాయిని ప్రార్థించాం. ఆయన ఆరోగ్య పరిస్థితి చూసి డాక్టర్లు మమ్మల్ని తిట్టారు. కాలి సమస్య తీవ్రమవుతుందని, జీవితాంతం ఉండిపోతుందన్నారు. ఇది చెప్పినా చంద్రబాబు పాదయాత్ర విరమణకు ఒప్పుకోలేదు. అలా ఆయన్ని ముందుకు నడిపించింది మీ అభిమానమే. ఆ అభిమానంతోనే ఆయన్ను ఏడాది తిరగకుండా ఈ ర్రాష్టానికి మరోసారి ముఖ్యమంత్రిని చేయండి. మీ సమస్యలు పరిష్కరించి రుణం తీర్చుకుంటారు'' అంటూ గరికపాటి తన ప్రసంగాన్ని ముగించారు.