April 28, 2013

సభకు వెళ్లడంపై చూద్దామన్న హరికృష్ణ

హరికృష్ణ గైర్హాజరు
జూనియర్ ఎన్టీఆర్,దాడి,కడియం కూడా


విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభకు పార్టీకి చెందిన పలువురు సీనియర్లు గైర్హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్, విశాఖకే చెందిన సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు దాడి వీరభద్రరావు, తెలంగాణలో సీనియర్ నేత కడియం శ్రీహరి విశాఖ సభకు దూరంగా ఉన్నారు. భారీ బహిరంగ సభకు హాజరు కాకుండా హరికృష్ణ ఢిల్లీలోనే ఉండిపోయారు. ఆ సభకు వెళతారా? అని విలేకరులు ప్రశ్నించగా.. "చూద్దాం.. ఇంకా నిర్ణయించుకోలేదు'' అని చెప్పిన హరికృష్ణ.. సభ జరుగుతున్న సమయానికి ఢిల్లీలోనే ఉండిపోయారు.

టీడీపీలో హరికృష్ణను అణిచి వేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి చిట్టూరి ప్రసాద్ చేసిన ప్రకటనను ఆయన స్వయంగా ఆం«ధజ్యోతి విలేకరి దృష్టికి తీసుకువచ్చారు. కానీ, దాని ఆంతర్యమేమిటో వివరించలేదు. ఇక, కడియం శ్రీహరి పార్టీ అధిష్ఠానంపై అలకబూనారు. తన సొంత నియోజకవర్గం స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కార్యకర్తలను విశాఖకు పంపిన ఆయన.. స్వయంగా వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో, ఆయన పార్టీని వీడనున్నారనే వార్తలు వెలువడ్డాయి. దీనిపై కడియంను వివరణ కోరగా, ఇటీవల జరిగిన పరిణామాలపై మనస్తాపంతోనే సభకు వెళ్లలేదని, అంతమాత్రాన పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.