April 28, 2013

నిమ్మనవారిని జైలుకు పంపడమా..?వైసీపీపై బాల కృష్ణ ధ్వజం

ఇదేనా వారి విశ్వసనీయత? : బాల కృష్ణ

ఏదైనా ఉన్నత శిఖరం చేరాలంటే సత్సంకల్పం ఉండాలని నాన్న ఎన్‌టీఆర్ చెప్పేవారని, ఆ సద్గుణాలన్నీ చంద్రబాబులో ఉన్నాయని బాలయ్య అన్నారు. తప్పుచేసిన వారిపట్ల ఎన్‌టీఆర్ చండశాసనుడిలా వ్యవహరించారని, బడుగుబలహీన వర్గాలకు జస్టిస్ చౌదరిలా న్యాయం చేశారని, సంఘ సంస్కరణలకు బొబ్బిలి పులిలా పనిచేశారని వ్యాఖ్యానించారు. పార్టీ అనేకసార్లు క్లిష్టపరిస్థితుల్లో చిక్కుకుంటే చంద్రబాబు రక్షించుకుంటూ వచ్చారన్నారు.

ఆయన పాలనాదక్షుడన్నారు. దురదృష్టం కొద్దీ రాష్ట్రంలో రెండుసార్లు తెలుగుదేశం పార్టీ ఓడిపోతే.. కాంగ్రెస్ నాయకులు అధికారం చేపట్టి ర్రాష్టాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. విద్యుత్ ఇవ్వలేక ఆంధ్రప్రదేశ్‌ను అంధకారప్రదేశ్‌గా మార్చేశారన్నారు. రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరినా ప్రజలకు ఏమీ మేలు జరగడం లేదన్నారు.

గంగపుత్రులకు చేపల వేటకు విరామం ఇచ్చారని, తమిళనాడులో ఒక్కో కుటుంబానికి రూ. 4,700 ఆర్థికసాయం చేస్తుండగా, ఇక్కడ నయాపైసా కూడా ఇవ్వడం లేదన్నారు. బాబును అంతా డిక్టేటర్ అంటూ విమర్శిస్తున్నారని, ర్రాష్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ఆ డైనమిజమ్ తప్పకుండా ఉండాలని బాలకృష్ణ పేర్కొన్నారు. జైలు నుంచి బయటకు వస్తాడో రాడో తెలియని జగన్ అధికారంలోకి వస్తాడని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ర్రాష్టానికి పూర్వవైభవం తీసుకురావాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వసనీయత గురించి కొందరు మాట్లాడుతున్నారని, విశ్వసనీయత అంటే నమ్మినవారిని జైలుకు పంపడమేనా? అని సినీనటుడు బాలకృష్ణ వైసీపీని విమర్శించారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో పనిచేసిన మంత్రులు, ఐఏఎస్ అధికారులను ఇప్పుడు జైలుకు పంపారని, అలాంటి విశ్వసనీయత తమకవసరం లేదని బాలకృష్ణ అన్నారు. ర్రాష్టానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఉద్ఘాటించారు. సభకు విచ్చేసిన జనవాహినిని చూస్తూ తనదైన సినీ శైలిలో "నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లుపడిందా.. సప్తసముద్రాలు ఉప్పొంగాయా?'' అని వ్యాఖ్యానించారు.