April 9, 2013

కార్యకర్తల అభీష్టం మేరకే నూజివీడు అభ్యర్థి ఎంపిక


నూజివీడు: 'నూజివీడు నియోజకవర్గం జిల్లాలో టీడీపీకి పెట్టనికోట. ఇలాంటి కోటలో ముక్కూ మొహం తెలియని అభ్యర్ధిని పార్టీ పంపినా పార్టీ నాయకత్వం మీద విశ్వాసంతో ప్రజలు గెలిపించారు. ఈ సారి కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థి ఎంపిక ఉంటుందని బాలకృష్ణ టీడీపీ అభిమానులకు స్పష్టం చేశారు. నూజివీడు నియోజక వర్గ పరిధిలోని అడవినెక్కలంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన బాలకృష్ణ అక్కడ అభిమానులు, టీడీపీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేక, స్వార్ధ ప్రయోజనాల కోసం కొందరు పార్టీని వీడినా, పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు.

బీసీలను బలపరిచి, వారిని సమాజంలో రాజకీయ చైతన్యవంతులుగా తీర్చిదిద్ది, వారి అభివృద్ధికి పాటుపడిన ఏకైక వ్యక్తి టీడీపీవ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని ఆయన శ్లాఘించారు. సమాజంలో అణగారిన వర్గాలకు టీడీపీ అండగా ఉంటుందనే దానికి నిదర్శనం, ఇటు బీసీలకు, అటు మాదిగలకు టీడీపీ మద్దతుగా నిలవటమేనన్నారు. మారిన బాలకృష్ణ తీరు బాలకృష్ణ అంటే ఒక ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. అలాంటిది రెండు రోజులుగా జిల్లాలో జరుపుతున్న పర్యటనలో తన శైలి మార్చుకుని, ప్రజలతో మమేకమవుతూ ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతోంది.

విజయవాడ నుంచి ఆదివారం బయలుదేరిన బాలకృష్ణ తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం చేరేవరకూ ప్రతి గ్రామంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రజలు బాలకృష్ణ కోసం గంటలకొద్దీ సమయం వేచి ఉన్నారు. ఆగిన ప్రతిచోట, బాలకృష్ణ ప్రజలకు అభివాదం చేస్తూ, కరచాలనం చేస్తూ వారితో ఫొటోలు దిగుతూ ఆటో గ్రాఫ్‌లు ఇస్తూ సందడి చేశారు. నూజివీడు, తిరువూరు నియోజక వర్గాలలో ఆదివారం బాలకృష్ణ జరిపిన పర్యటన పూపర్ హిట్ అయింది.

ఎవరికివారే యమునా తీరే నూజివీడు నియోజకవర్గంలో బాలకృష్ణ పర్యటన సందర్భంగా టీడీపీ ముఖ్యనాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నచందాన వ్యవహరించారు.

నూజివీడు నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నా అట్లూరి ట్రస్ట్ బ్రదర్స్ ,కాపా శ్రీనివాసరావు, నూతక్కి వేణుగోపాలరావు, ఎవరికి వారే యమునాతీరే అన్నచందంగా వ్యవహరించారు. విజయవాడ, నున్న నుంచి అడవినెక్కలం మీదుగా నూజివీడు నియోజకవర్గంలోకి ప్రవేశించిన బాలకృష్ణ ఎదుట ఈ ముగ్గురు నాయకులు తమ సొంత బలాలను ప్రదర్శించుకున్నారు. రావిచర్ల అడ్డరోడ్డువద్ద కాపా, నూజివీడు అట్లూరిచారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద అట్లూరి వెంకట నరేంద్ర తమ బలాలను ప్రదర్శించారు.

లక్ష్మినరసింహ చిత్రపటంపై బాలకృష్ణ ఆసక్తి నూజివీడు పట్టణంలోకి ప్రవేశించగానే ప్రధాన రహదారి పక్కనే ఉన్న అట్లూరి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద అట్లూరి నరేంద్ర బాలకృష్ణకు ఘనస్వాగతం పలికారు. బాలకృష్ణకు అత్యంత ఇష్టదైవమైన లక్ష్మీనరసింహస్వామి ఉన్న పెద్ద చిత్రపటాన్ని ఆయనకు బహూకరించటానికి సిద్ధమై ఆయన రాకకోసం వేచి చూశారు. ట్రస్ట్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో టీడీపీ అభిమానులు ఉన్నప్పటికీ నరేంద్ర ఇవ్వచూపిన లక్ష్మినరసింహస్వామి చిత్రపటాన్ని అందుకోవడానికి బాలకృష్ణ ప్రత్యేక ఆసక్తి చూపారు.